జైల్లో ఉన్న ప్రధాని,సీఎం,మంత్రుల తొలగింపు బిల్లుపై అమిత్ షా వివరణ

న్యూఢిల్లీ, ఐఏషియ న్యూస్: జైల్లో ఉన్నవారు ప్రధాని, సీఎం, మంత్రులుగా కొనసాగకుండా కేంద్రం కొత్త బిల్లు తీసుకువచ్చిన సంగతి విదితమే. అయితే ఈ బిల్లుపై విపక్షాలు మండిపడుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర హెూంమంత్రి అమిత్ షా ఈ కొత్తబిల్లుపై సోషల్ మీడియా వేదికగా వివరణ ఇచ్చారు. రాజకీయాల్లో నైతిక విలువలను పునరుద్ధరించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఈ కీలక బిల్లు తెచ్చిందని స్పష్టం చేశారు. అరెస్ట్ అయి జైల్లో ఉన్న వ్యక్తులు ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి లేదా మంత్రులు వంటి ఉన్నత రాజ్యాంగ పదవుల్లో కొనసాగకుండా నిరోధించేందుకు ఉద్దేశించిన మూడు రాజ్యాంగ సవరణ బిల్లులను లోక్ సభలో ప్రవేశపెట్టినట్టు వెల్లడించారు.

స్పీకర్ అనుమతితో సభ ముందు ఈ బిల్లులను ఉంచినట్లు ఆయన తెలిపారు.బిల్లుల్లోని ప్రధాన నిబంధనలు గురించి అమిత్ షా తెలియజేశారు జైల్లో ఉంటే పదవిలో కొనసాగలేరు.ఏదైనా కేసులో అరెస్ట్ అయి జైలులో ఉన్న వ్యక్తి ప్రధానమంత్రి, ముఖ్యమంత్రిగా గానీ, కేంద్ర లేదా రాష్ట్ర మంత్రిగా గానీ తన విధులను నిర్వర్తించలేరు.వారు తమ పదవిలో కొనసాగడాన్ని ఈ బిల్లులు పూర్తిగా నిరోధిస్తాయి.30 రోజుల గడువు విధించారు. అరెస్టయిన రాజకీయ నాయకుడు 30 రోజుల్లోగా బెయిల్ పొందడంలో విఫలమైతే, ఈ కొత్త బిల్లు ప్రకారం 31వ రోజున వారిని పదవి నుంచి తప్పించాల్సి ఉంటుంది.ఒకవేళ ప్రధానమంత్రి లేదా ముఖ్యమంత్రి వారిని తొలగించకపోతే, చట్టప్రకారం వారు ఆ పదవిలో కొనసాగే అర్హతను వాటంతట అవే కోల్పోతారు.

అయితే న్యాయ ప్రక్రియ ద్వారా బెయిల్ పొందిన తర్వాత తిరిగి వారిని ఆ పదవుల్లో నియమించేందుకు అవకాశంఉంటుంది.రాజ్యాంగాన్ని రూపొందించిన సమయంలో, నేతలు అరెస్ట్ అయిన తర్వాత కూడా నైతిక బాధ్యతతో రాజీనామా చేయరని బహుశా మన రాజ్యాంగ నిర్మాతలు ఊహించి ఉండరని అమిత్ షా వ్యాఖ్యానించారు. ఇటీవల కాలంలో కొందరు ముఖ్యమంత్రులు, మంత్రులు అరెస్ట్ అయినా రాజీనామా చేయకుండా జైలు నుంచే ప్రభుత్వాలను నడుపుతున్న దిగ్భ్రాంతికరమైన సంఘటనలు దేశం చూసిందని ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు.ఈ జాడ్యంపై ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకతను,రాజకీయాల్లో దిగజారుతున్న ప్రమాణాలను దృష్టిలో ఉంచుకునే ఈ బిల్లులను తీసుకొచ్చినట్లు ఆయన వివరించారు.ఈ సందర్భంగా, ఒక మంత్రి, ముఖ్యమంత్రి లేదా ప్రధానమంత్రి జైలు నుంచి ప్రభుత్వాన్ని నడపడం సరైనదేనా? అనే విషయాన్ని దేశ ప్రజలు కూడా తేల్చుకోవాలని అమిత్ షా వ్యాఖ్యానించారు.

Authored by: Vaddadi udayakumar

About admin

Check Also

ఈ యాప్ ఉంటే చాలు.. కల్తీ మద్యం కనిపెట్టొచ్చు..ఏపీ ప్రభుత్వం ఆలోచన

అమరావతి,ఐఏషియ న్యూస్: రాష్ట్రంలో కల్తీ మద్యం తయారీ, విక్రయాలను అరికట్టేందుకు ప్రత్యేక యాప్ తీసుకురావాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. ఈ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *