న్యూఢిల్లీ,ఐఏషియ న్యూస్: ఉపరాష్ట్రపతి ఎన్నికల రాజకీయం వేడెక్కింది. ఎన్డీఏ తమ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా మహారాష్ట్ర గవర్నర్ సీపీ రాధాకృష్ణన్‌ను ప్రకటించింది. తమిళనాడుకు చెందిన సీపీ రాధాకృష్ణన్ సుదీర్ఘ కాలం రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్‌తో అనుబంధం కలిగి ఉన్నారు. ఆయన రెండుసార్లు లోక్‌సభ సభ్యుడిగా కూడా పనిచేశారు. ఎన్డీఏ అభ్యర్థి ప్రకటన తర్వాత విపక్షాల వ్యూహంపై ఇప్పుడు ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే ఎన్ డి ఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి రాధాకృష్ణ ప్రధాని మోదీని మర్యాదపూర్వకంగా కలిశారు.
విపక్షాల వ్యూహంపై ఇండియా కూటమి కీలక సమావేశం
విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. ఉపరాష్ట్రపతి అభ్యర్థిపై చర్చించేందుకు పార్లమెంట్ ప్రాంగణంలో విపక్షాలకు సంబంధించి కీలక సమావేశం సోమవారం జరిగింది. ఈ సమావేశంలో రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున ఖర్గే, ‘ఇండియా’ కూటమిలోని మిత్రపక్షాల అభిప్రాయాలను తెలుసుకున్నారు. కొంతమంది విపక్ష నేతలు ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో అభ్యర్థిని నిలబెట్టకూడదని అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా బీహార్ ఎన్నికలు దగ్గరలో ఉన్నందును అధికార పక్షం క్రాస్ ఓటింగ్ ద్వారా తమ బలాన్ని పెంచుకుంటే.. అది బీహార్ ఓటర్లపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని వారు భావించారు.
తటస్థ అభ్యర్థిపై మల్లగుల్లాలు
కాంగ్రెస్ వర్గాల సమాచారాల ప్రకారం.. విపక్ష అభ్యర్థి కాంగ్రెస్ నుంచే ఉండాలనే నిబంధన ఏమీ లేదు. మిత్రపక్షాలు తటస్థ, స్వచ్ఛమైన నేపథ్యం ఉన్న అభ్యర్థి పేరును సూచిస్తే, కాంగ్రెస్ కూడా దానికి అంగీకరించే అవకాశం ఉంది. అయితే బీజేపీ, ఆర్ఎస్ఎస్ భావజాలానికి వ్యతిరేకంగా ఒక అభ్యర్థిని నిలబెట్టి,సిద్ధాంతపరమైనపోరాటాన్నికొనసాగించాలని కాంగ్రెస్ కోరుకుంటుంది.సంఖ్యాబలం తక్కువగా ఉన్నప్పటికీ ఎన్నికల బరి నుంచి తప్పుకోవడం అంటే బీజేపీకి స్వేచ్ఛగా మార్గం ఇవ్వడమేనని కాంగ్రెస్ భావిస్తోంది. ఈ విషయంపై రాహుల్ గాంధీ చర్చించనున్నట్లు తెలుస్తోంది. రాహుల్ ఈ నెల 19న సాయంత్రం ఢిల్లీకి తిరిగి వచ్చి మళ్లీ 21న బీహార్ వెళ్లనున్నారు. ఈ సమయంలో అన్ని పార్టీల మధ్య ఏకాభిప్రాయం కుదిరితే అభ్యర్థి పేరును ప్రకటించే అవకాశం ఉంది.సంక్షిప్తంగా ఎన్డీఏ అభ్యర్థి పేరు ఖరారు కాగా.. కానీ విపక్షాలు ఇంకా తమ నిర్ణయాన్ని ప్రకటించలేదు. మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీల నేతృత్వంలో ఇండియా కూటమి ఏ పేరును ఖరారు చేస్తుందనేది ఆసక్తికరంగా మారింది.
Authored by: Vaddadi udayakumar