అమరావతి,ఐఏషియ న్యూస్: ఏపీలో కూటమి సర్కార్ కీలక ఎన్నికల హామీ అయిన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం స్త్రీశక్తికి సంబంధించి ప్రభుత్వం ఇవాళ మార్గదర్శకాలు విడుదల చేసింది. ఈ పథకం ఏయే బస్సుల్లో అమలవుతుంది, టికెట్ల జారీ ఎలా ఉంటుంది, ఇతర వివరాలుతో కూడిన జీవోను ప్రభుత్వం జారీ చేసింది.
ప్రస్తుతానికి స్త్రీ శక్తి పథకాన్ని రాష్ట్రంలో అందుబాటులో ఉన్న బస్సులతోనే ప్రారంభిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. పథకం అమలు ప్రారంభం అయ్యాక అవసరాన్ని బట్టి కొత్త బస్సుల్ని కొనుగోలు చేసి ఇందులో చేరుస్తామని వెల్లడించింది. ఈ పథకాన్ని పల్లెవెలుగు, అల్ట్రా పల్లెవెలుగు, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ ప్రెస్,ఎక్స్ ప్రెస్ సర్వీసుల్లో మాత్రమే అమలు చేస్తున్నట్లు తెలిపింది.
నాన్ స్టాప్ సర్వీసులు, అంతర్ రాష్ట్ర సర్వీసులు, కాంట్రాక్ట్ బస్సుల్లో, ఛార్జర్డ్ సర్వీసులు, ప్యాకేజీ టూర్లలో ఈ పథకం అమలు కాదని ప్రభుత్వం తెలిపింది. అలాగే సప్తగిరి ఎక్స్ ప్రెస్, అల్ట్రా డీలక్స్, సూపర్ లగ్జరీ, స్టార్ లైనర్, ఏసీ బస్సుల్లో ఈ పథకం వర్తించదని వెల్లడించింది. నిర్దేశిత రూట్లలో అర్హులైన మహిళలు ఉచిత ప్రయాణాలు చేసేందుకు అనుమతిస్తామని పేర్కొంది. మహిళల భద్రత కోసం మహిళా కండక్టర్లకు బాడీ లైన్ కెమెరాలు, బస్సుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది.
Authored by: Vaddadi udayakumar