మీ మద్దతు కావాలి: జగన్ కు కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్ ఫోన్

  • ఉపరాష్ట్రపతి ఎన్నికల వేళ ఏపీలో కీలక మలుపులు
  • ఉపరాష్ట్రపతి ఎన్నిక ఏకగ్రీవం కోసం ఎన్ డీఏ కూటమి ఆరాటం
  • ఇండియా కూటమి అభ్యర్థి పెడితే ఎన్నిక అనివార్యం

న్యూఢిల్లీ,ఐఏషియ న్యూస్: ఢిల్లీ కేంద్రంగా ఏపీలో కీలక రాజకీయ సమీకరణాలు చోటు చేసుకుంటున్నాయి. ఉప రాష్ట్రపతి ఎన్నిక వేళ బీజేపీ నాయకత్వం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. ఇప్పటికే మహారాష్ట్ర గవర్నర్ గా ఉన్న రాధాకృష్ణన్ ను తమ కూటమి అభ్యర్దిగా ఖరారు చేసింది. ఈ ఎన్నికలో ఇండియా కూటమి తమ అభ్యర్ధిని పోటీకి దింపేందుకు కసరత్తు చేస్తోంది. ఈ సమయంలోనే మాజీ సీఎం జగన్ కు కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్ ఫోన్ చేసారు. ఎన్నిక ఏకగ్రీవం కోసం మద్దతు కోరారు. మరి, జగన్ ఏం స్పందించారు. ఇప్పుడు ఈ పరిణామంరాజకీయంగాకీలకంగామారుతోంది.ఉపరాష్ట్రపతి ఎన్నిక వేళ బీజేపీ నాయకత్వం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. ఏకగ్రీవంగా తాము ప్రతిపాదించిన రాధాకృష్ణన్ ఎన్నిక జరిగే విధంగా ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగా ఏపీ లో వైసీపీ మద్దతు కోరింది.ఇతర పార్టీలతో సంప్రదింపుల బాధ్యత ప్రధాని మోదీ సీనియర్ మంత్రి రాజ్ నాధ్ సింగ్ కు అప్పగించారు.అందులో భాగంగా వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ కు రాజ్ నాధ్ సింగ్ ఫోన్ చేసారు. ఉప రాష్ట్రపతి ఎన్నికలో తమ అభ్యర్ధి గురించి వివరించారు. ఏకగ్రీవం అయ్యేలా మద్దతు ఇవ్వాలని కోరారు. దీని పైన జగన్ పార్టీలో చర్చించి.. నిర్ణయం చెబుతామని చెప్పినట్లు తెలుస్తోంది. అటు ఇండియా కూటమి తమ అభ్యర్ధిని బరిలోకి దించితే సెప్టెంబర్ 9 నాడు ఎన్నిక అనివార్యం కానుంది.
జగన్ ఎవరివైపు
2024 ఎన్నికల వరకు కేంద్రంలో ఎన్డీఏ కు జగన్ పలు సందర్భాల్లో మద్దతుగా నిలిచారు. 2024 ఎన్నికల్లో బీజేపీ ఏపీలో టీడీపీ, జనసేనతో జత కట్టింది. ఆ ఎన్నికల్లో జగన్ ఓడిపోయారు. కాగా, ఇక ఉప రాష్ట్రపతి ఎన్నిక కోసం ఓటింగ్ చేసే ఎలక్టోరల్ కాలేజ్ లో ఎన్డీఏ కూ పూర్తి మెజార్టీ ఉంది. అయినా, ఏకగ్రీవం కోసం సంప్రదింపులు చేస్తున్నారు. పార్లమెంట్ లో జగన్ కు నలుగురు లోక్ సభ సభ్యులు.. ఏడుగురు రాజ్యసభ సభ్యుల మద్దతు ఉంది. ఇక, కాంగ్రెస్ పైన తొలి నుంచి జగన్ వ్యతిరేకంగా ఉన్నారు. తాజాగా ఓట్ల చోరీ పైన మాట్లాడుతున్న రాహుల్ గాంధీ ఏపీ విషయంలో మాట్లాడకపోవటం పైన జగన్ మండిపడ్డారు.రాహుల్, మాణిక్కం ఠాగూర్ ను టార్గెట్ చేసారు. ఈ పరిస్థితుల్లో జగన్ కాంగ్రెస్ కు మద్దతు ఇచ్చే అవకాశం లేదు.
కీలక మలుపు
నేరుగా రాజ్ నాధ్ సింగ్ ఫోన్ చేసి అడగటంతో పార్టీలో చర్చ తరువాత జగన్ సానుకూలంగానే తమ నిర్ణయం వెల్లడించే అవకాశం కనిపిస్తోంది. ఇటు ఏపీలో మారుతున్న సమీకరణాల వేళ చంద్రబాబు, పవన్ టార్గెట్ గా జగన్ పోరాటం చేస్తున్నారు. 2029 ఎన్నికల వ్యూహాల్లో భాగంగా ఇప్పటి నుంచే జగన్ ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు. అందులో భాగంగా ఉపరాష్ట్రపతి ఎన్నిక ఏకగ్రీవం కాకుండా ఎన్నిక జరిగితే వైసీపీ మద్దతు ఎన్డీఏ వైపే ఉంటుందనే అంచనాలు వ్యక్తం అవుతున్నాయి. ఇదే జరిగితే ఏపీలోని మూడు ప్రధాన పార్టీలు ఎన్డీఏ వైపే ఉన్నట్లు మరోసారి స్పష్టం కానుంది. ఈ లెక్కలు భవిష్యత్ సమీకరణాలకు కీలకం కానున్నాయి. దీంతో, రానున్న రోజుల్లో ఏపీలో రాజకీయం మరింత ఆసక్తి కరంగా మారే అవకాశం కనిపిస్తోంది.

Authored by: Vaddadi udayakumar

About admin

Check Also

ఈ యాప్ ఉంటే చాలు.. కల్తీ మద్యం కనిపెట్టొచ్చు..ఏపీ ప్రభుత్వం ఆలోచన

అమరావతి,ఐఏషియ న్యూస్: రాష్ట్రంలో కల్తీ మద్యం తయారీ, విక్రయాలను అరికట్టేందుకు ప్రత్యేక యాప్ తీసుకురావాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. ఈ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *