విశాఖపట్నం,ఐఏషియ న్యూస్: తెలుగును ఓ పాఠ్యాంశంగా కాకుండా తెలుగు భాషలో ప్రాథమిక విద్యాబోధనకు పెద్ద పీట వేసి, ఆంగ్లాన్ని పాఠ్యాంశంగా బోధించడం ద్వారా తెలుగు భాషను పరిరక్షించాలని “తెలుగు దండు” ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేసింది. ప్రభుత్వం తెలుగు మాధ్యమం పట్ల సానుకూల నిర్ణయం తీసుకోని పక్షంలో అసెంబ్లీ సమావేశాల్లో గాంధేయ మార్గంలో సాగే మాతృభాష పరిరక్షణ ఉద్యమ ఉధృతిని రుచి చూడాల్సి ఉంటుందని హెచ్చరించారు. విశాఖపట్నంలోని తెలుగు దండు కార్యాలయంలో సోమవారం ఉదయం తెలుగు భాషాభిమానులు విలేకరుల సమావేశం నిర్వహించారు. తెలుగుదండు వ్యవస్థాపక అధ్యక్షులు పరవస్తు సూరి మాట్లాడుతూ “తెలుగుభాషను అవమానించిన, నిర్లక్ష్యం చేసిన ఏ ప్రభుత్వాన్ని.. ఈ తెలుగునేల పొరపాటున కూడా క్షమించలేదు. మెడపట్టిమరీ బయటకుగెంటివేసింది. ఇది చరిత్ర” అన్నారు. మన రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి..ఏడాదిన్నర అయినప్పటికీ, తెలుగుభాష రక్షణ విషయంలో.. తీయగా కబుర్లు చెబుతుందే కానీ చేతలు మాత్రం శూన్యమని విమర్శించారు. ఈనెల 18వ తేదీ నుంచి జరిగే..అసెంబ్లీ సమావేశాలకు వెళతామని, అసెంబ్లీ ప్రాంగణం ముందే… తెలుగుభాష రక్షణ గురించి కూటమి ప్రభుత్వంతో అమీతుమీ తేల్చుకొంటామని… వందలాది మంది కవులు, కళాకారులు, సాహితీవేత్తలు, భాషాభిమానులు, భాషోద్యమకారులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు ఇప్పటికే ప్రతిజ్ఞ చేశారని తెలుగుదండు ఆధ్వర్యవంలో అసెంబ్లీ సమావేశాలు ముగిసేంతవరకూ అక్కడే ఉంటామని, తెలుగుభాష రక్షణకు కూటమి ప్రభుత్వం తన వైఖరి స్పష్టంగా ప్రకటించేంతవరకూ అసెంబ్లీ ప్రాంగణంలోనే నిరసనలు తెలియజేస్తూ ఉంటామని సంకల్పం చెప్పుకొన్నారు. ఈ సమావేశంలోవేదుల కామేశ్వర శర్మ, సిహెచ్. చిన సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
Authored by: Vaddadi udayakumar