చట్టం చేయనున్నట్లు ప్రకటించిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్,ఐఏషియ న్యూస్: తెలంగాణలో మరో విడత ఉద్యోగాల నియామకాల ప్రక్రియ పూర్తయింది. గ్రూప్- 2 సర్వీసులకు ఎంపికైన 783 మంది అభ్యర్థులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లాంఛనంగా నియామక పత్రాలను అందజేశారు. శిల్పకళా వేదికలో ఏర్పాటు చేసిన ప్రజాపాలనలో కొలువుల పండుగ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగంలో చేరడానికి తల్లితండ్రులు తమ రక్తాన్ని చెమటగా మార్చి మిమ్మల్ని భూజాన మోసిన తల్లిదండ్రులను మరిచిపోవద్దని రేవంత్ రెడ్డి హితవు పలికారు. కన్న తల్లిదండ్రులను,పుట్టి పెరిగిన ఊరిని అభివృద్ధి చేసుకోవడం మీ బాధ్యత అని సూచించారు. ఏ పేదవాడిలోనైనా తల్లిదండ్రులను గుర్తు తెచ్చుకుని సేవలు అందించాలన్నారు. నిస్సహాయులకు అండగా సహాయం అందించడమే బాధ్యతగా విధులు నిర్వర్తించాలని చెప్పారు.ఎవరైనా తల్లిదండ్రులను విస్మరిస్తే వారి జీతం నుంచి 10 శాతం కోత పెట్టి నేరుగా తల్లిదండ్రుల ఖాతాల్లో వేసేట్టుగా చట్టం చేయబోతున్నామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
Authored by: Vaddadi udayakumar