స్పెషల్ డెస్క్,ఐఏషియ న్యూస్: రష్యా రైతు అలెగ్జాండర్ చుసోవ్ అరుదైన ఘనత సాధించారు. ఏకంగా 969 కిలోల బరువున్న భారీ గుమ్మడికాయను పండించి కొత్త రికార్డు సృష్టించారు. ఈ గుమ్మడికాయను మాస్కోలో జరిగిన అతిపెద్ద కూరగాయల పోటీలో ప్రదర్శించారు. రష్యా చరిత్రలో ఇంత పెద్ద గుమ్మడికాయ మొదటిసారి నమోదు కావడం విశేషం.
ఆరు నెలల శ్రమ ఫలితం
ఈ భారీ గుమ్మడికాయను పెంచడానికి చుసోవ్ దాదాపు ఆరు నెలలకు పైగా కృషి చేసినట్టు తెలిపారు. గుమ్మడికాయ పెరుగుదలకు అనువైన వాతావరణం కోసం ప్రత్యేకంగా గ్రీన్‌హౌస్ నిర్మాణం చేసినట్టు పేర్కొన్నారు. నేల ఉష్ణోగ్రత, గాలి తేమ స్థాయిలను నియంత్రించి, సైన్స్ ఆధారిత పద్ధతులు ఉపయోగించానని వివరించారు.
ప్రత్యేక సేంద్రియ ఎరువులు వాడకం
చుసోవ్ తెలిపిన ప్రకారం గుమ్మడికాయ పెరిగే విధానం మొత్తం నిత్య పర్యవేక్షణలో జరిగిందని తెలుస్తోంది. ప్రతి రోజు తగిన మోతాదులో నీరు అందించడం, ప్రత్యేక సేంద్రీయ ఎరువులు వాడటం.. ఉష్ణోగ్రతను క్రమం తప్పకుండా పరీక్షించడం, తగినంత సూర్యరశ్మి, కాంతి అందించడం వంటి అంశాలను పాటించానని స్పష్టం చేశారు. కాగా ఇది సాధారణంగా పెంచే గుమ్మడికాయలకన్నా 20 రెట్లు ఎక్కువ బరువు అని నిపుణులు చెబుతున్నారు.
పోటీల్లో ప్రత్యేక ఆకర్షణ..
ఈ మేరకు నిర్వహించిన పోటీల్లో దేశం నలుమూలల నుంచి మూడు వేల మందికి పైగా రైతులు పాల్గొన్నారు. ప్రతి రైతు తమ కూరగాయలను ప్రత్యేక రీతిలో ప్రదర్శించారు. ఇందులో 969 కిలోల గుమ్మడికాయ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. అదేవిధంగా, 144 కిలోల బరువున్న పుచ్చకాయ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది.ప్రస్తుతం ప్రపంచంలోనే అతిపెద్ద గుమ్మడికాయ రికార్డు ఇటలీ రైతు స్టెఫానో కూట్రుపీ పేరిట ఉంది. ఆయన 2021లో పండించిన గుమ్మడికాయ బరువు 1,226 కిలోలు. చుసోవ్ గుమ్మడికాయ ఆ రికార్డును అధిగమించకపోయినా, రష్యా చరిత్రలో ఇది అత్యంత భారీ గుమ్మడికాయగా నిలిచింది. ఇక ఈ ఘనతతో చుసోవ్,వ్యవహారందేశవ్యాప్తంగాచర్చనీయాంశమైంది. కేవలం రష్యాలోనే కాక, అంతర్జాతీయ స్థాయిలో కూడా ఆయన పేరు వినిపిస్తోంది. వ్యవసాయ రంగంలో సాంకేతికతను వినియోగిస్తే ఎలా అద్భుత ఫలితాలు సాధించవచ్చో చుసోవ్ ఉదాహరణ అని నిపుణులు అభిప్రాయపడ్డారు.
Authored by: Vaddadi udayakumar