ఎర్రకోటపై జాతీయ పతాక ఆవిష్కరణలో ప్రధాని మోడీ ఉద్వేగ ప్రసంగం
న్యూఢిల్లీ,ఐఏషియ న్యూస్: యావత్ దేశం 79వ స్వాతంత్ర్య దినోత్సవాలను జరుపుకొంటోంది. దేశం మొత్తం త్రివర్ణ పతాకాలతో రెపరెపలాడుతోంది. నయా భారత్.. అనే థీమ్‌తో ఈ ఏడాది స్వాతంత్య్ర దినోత్సవాన్ని వైభవంగా జరుపుకొంటున్నారు దేశ ప్రజలందరూ. జాతీయ సమగ్రత, దేశాభివృద్ధికి సంకేతంగా ఈ థీమ్‌ను రూపొందించింది ప్రభుత్వం.పంద్రాగస్టు వేడుకలను పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ రాజధాని ఢిల్లీ ఎర్రకోటపై మువ్వన్నెల పతాకాన్ని ఎగురవేశారు. జాతిని ఉద్దేశించి ప్రసంగించారు.కేంద్ర మంత్రులు, పార్లమెంట్ సభ్యులు,అధికారులు,ఈ కార్యక్రమాలకు హాజరయ్యారు.జాతీయ పతకాన్ని ఎగురవేసిన అనంతరం దేశ ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలను తెలియజేశారు ప్రధాని మోదీ. అసేతు హిమాచలం,వందేమాతరం అనే నినాదం వినిపిస్తోందన్నారు. రైతులు, మహిళలు, యువత ఇలా అన్ని వర్గాల ప్రజలు అచంచల భక్తితో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో మమేకం అయ్యారని చెప్పారు.తన ప్రసంగంలో ఆపరేషన్ సింధూర్ ను ప్రస్తావించారు ప్రధాని మోదీ. శత్రువులను అంచనాలకు మించిన స్థాయిలో దెబ్బతీశామని, వాళ్ల వెన్ను విరిచామన్నారు.దేశ ప్రజలపై తుపాకి ఎక్కుపెట్టిన శత్రువులు ఎంతటివారైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదనడానికి ఆపరేషన్ సింధూర్ ఓ తాజా ఉదాహరణ అని మోదీ చెప్పారు.కొద్దిరోజులుగా సంభవిస్తూ వస్తోన్న విపత్తులపై మోదీ మాట్లడారు. ఈ మధ్యకాలంలో ప్రకృతివైపరీత్యాలు తలెత్తుతున్నాయని, ఆయా ప్రాంతాల్లో నివసించే ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలించడానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తోన్నామని చెప్పారు. దీనికోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సహాయక చర్యలు, పునరావాస పనుల్లో నిమగ్నం అయ్యాయని వివరించారు.కొండచరియలు విరిగిపడటం, ఆకస్మిక వరదల వంటి అనేక విపత్తులను ఎదుర్కొంటున్నామని మోదీ గుర్తు చేశారు. విపత్తుల బారిన పడిన ప్రజలకు పూర్తి సహాయ సహకారాలను అందించడానికి తాము సంసిద్ధంగా ఉన్నామని తెలిపారు. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేస్తోన్నాయని పేర్కొన్నారు.
Authored by: Vaddadi udayakumar