శబరిమల,ఐఏషియ న్యూస్: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన శబరిమల ఆలయ బంగారం చోరీ కేసులో కేరళ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ కీలక పురోగతి సాధించింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు, పీఠాధిపతిగా మారి వ్యాపారవేత్త అయిన ఉన్నికృష్ణన్ పొట్టిని శుక్రవారం తెల్లవారుజామున అదుపులోకి తీసుకున్నారు.
కేరళ హైకోర్టు ఆదేశాల మేరకు ఏర్పాటైన సిట్ బృందం, క్రైమ్ బ్రాంచ్ ఎస్పీ నేతృత్వంలో గురువారం ఉదయం నుండి కిలిమనూరు సమీపంలోని ఉన్నికృష్ణన్ నివాసంలో దాదాపు 11 గంటలకు పైగా సుదీర్ఘంగా విచారణ జరిపింది. అనంతరం,శుక్రవారం తెల్లవారుజామున అతని అరెస్టును లాంఛనంగా నమోదు చేసింది. వైద్య పరీక్షల నిమిత్తం తిరువనంతపురం జనరల్ ఆసుపత్రికి తరలించిన తర్వాత, అతడిని పతనంతిట్టలోని రాన్నీ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరు పరిచారు.శబరిమల సన్నిధానంలోని శ్రీకోవిల్ (గర్భగుడి) ద్వారపాలకుల విగ్రహాలు,గడపకు బంగారు తాపడం పనులు చేయించినప్పుడు 475 గ్రాముల (సుమారు 56 సవర్ల) బంగారం అపహరణకు గురైనట్లు ఆరోపణలు వచ్చాయి. 2019లో జరిగిన ఈ మరమ్మత్తుల కోసం బంగారు పూత పూయడానికి అప్పగించిన కళాకృతుల్లో 4.5 కిలోల బరువు తగ్గడాన్ని దేవస్వం విజిలెన్స్ అధికారి నివేదికలో గుర్తించారు. ఈ మేరకు చేసిన సిట్ దర్యాప్తులో నిందితుడిని అరెస్ట్ చేయడం జరిగింది.
Authored by: Vaddadi udayakumar