సచివాలయాల్లో 2,778 పోస్టుల భర్తీకి కేబినెట్ గ్రీన్ సిగ్నల్
ఏపీ చీఫ్ బ్యూరో,ఐఏషియ న్యూస్: ఏపీ రాజధాని అమరావతిలో గురువారం సమావేశమైన రాష్ట్ర మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. కేబినెట్ ముందుకు వచ్చిన పలు ప్రతిపాదనలపై సీఎం చంద్రబాబు మంత్రులతో చర్చించి ఆమోదముద్ర వేశారు. కేబినెట్ నిర్ణయాల్లో అమరావతి రాజధానిలో భూకేటాయింపులు, సచివాలయాల్లో ఖాళీల భర్తీ, అధికార భాష సంఘం పేరు మార్పు వంటి పలు అంశాలు ఉన్నాయి.ఇవాళ ఏపీ కేబినెట్ మొత్తం 33 నిర్ణయాలకు ఆమోద ముద్ర వేసింది. ఇందులో అమరావతిలోని 29 గ్రామాల్లో రూ.904 కోట్లతో మౌలిక సదుపాయాల కల్పన, 51వ సీఆర్డీయే సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు ఆమోదం, సీఆర్డీయే పరిధిలో వివిధ సంస్థలకు భూకేటాయింపులు, ఏపీ సర్కులర్ ఎకానమీ, వేస్టే రీసైక్లింగ్ పాలసీకి ఆమోదం, పర్యాటక ప్రాజెక్టులకు భూకేటాయింపులకు మార్గదర్శకాలు వంటివి ఉన్నాయి.అలాగే రాష్ట్రంలోని గ్రామ, వార్డు సచివాలయాల్లో మొత్తం 2,778 పోస్టుల భర్తీకి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.ఇవన్నీ డిప్యుటేషన్, ఔట్ సోర్సింగ్ విధానంలో భర్తీ చేస్తారు. దీంతో పాటు రాష్ట్ర అధికార భాష కమిషన్ కు మండలి వెంకట కృష్ణారావు అధికారిక భాష కమిషన్ గా పేరు మార్చారు. మరోవైపు పుష్కర ఎత్తిపోతల పథకంలో కాలువ అభివృద్ధి పనులకు ఆమోదం,పంచాయతీ రాజ్, ఏపీ యాచక నిరోధక చట్టాల సవరణ ప్రతిపాదనలకు ఆమోదం తెలిపారు.వీటితో పాటు కడప జిల్లా మైలవరంలో 250 మెగావాట్ల సోలార్ పవర్ ప్రాజెక్టుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే అదానీ సోలార్ ఎనర్జీకి 200 ఎకరాల కేటాయింపుకు ఆమోదం తెలిపింది. గుంటూరు టీడీపీ కార్యాలయం భూమి లీజు కాలం పొడిగింపుకు ఆమోదం తెలిపారు. చిత్తూరు సీహెచ్సీని 100 పడకల ఆస్పత్రిగా మార్చడంతో పాటు 50 కొత్త పోస్టుల మంజూరు ప్రతిపాదనకు ఆమోదం తెలిపారు.నాలా పన్ను 4 శాతంలో 70 శాతం స్థానిక సంస్థలకు 30 శాతం అథారిటీలకు ఇవ్వాలని నిర్ణయించారు. అలాగే మద్యం ప్రాథమిక ధరలు, విదేశీ మద్యం బ్రాండ్లకు టెండర్ కమిటీ చేసిన సిఫార్సులు ఆమోదించారు.
Authored by: Vaddadi udayakumar