- ఏపీ-సింగపూర్ స్టార్టప్ ఫెస్టివల్ నిర్వహిస్తాం
- విశాఖలో నిర్వహించే పెట్టుబడుల సదస్సుకు రండి
- ఏపీ-సింగపూర్ బిజినెస్ ఫోరమ్ రోడ్ షోలో సీఎం చంద్రబాబు
- రాష్ట్రంలో పెట్టుబడులకున్న అవకాశాలపై సీఎం పవర్ పాయింట్ ప్రజెంటేషన్
ఏపీ చీఫ్ బ్యూరో,ఐఏషియన్యూస్: పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ అత్యుత్తమ ఎంపిక అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఆ పెట్టుబడులు కూడా అత్యంత భద్రంగా ఉంటాయని పారిశ్రామికవేత్తలకు భరోసా ఇచ్చారు. ఈ ఏడాది నవంబర్ లో విశాఖలో నిర్వహించనున్న భాగస్వామ్య సదస్సుకు సన్నాహకంగా ఏపీ- సింగపూర్ బిజినెస్ ఫోరమ్ తరపున రోడ్ షో కార్యక్రమానికిముఖ్యమంత్రిచంద్రబాబుహాజరయ్యారు. ఈ సమావేశానికి సింగపూర్ కంపెనీల ప్రతినిధులతో పాటు ఏపీ నుంచి కూడా పెద్ద ఎత్తున ప్రతినిధులు హాజరయ్యారు. ఈ రోడ్ షో కార్యక్రమంలో ఏపీలో అమలు చేస్తున్న పారిశ్రామిక అనుకూల పాలసీలు, ప్రాజెక్టులు, పెట్టుబడులకు ఉన్న అవకాశాలతో పాటు ఏపీ అభివృద్ధి కోసం రూపోందించిన 2047 స్వర్ణాంధ్ర ప్రణాళికలపై ముఖ్యమంత్రి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. నవంబర్ 14,15వ తేదీల్లో విశాఖలో నిర్వహించనున్న పెట్టుబడుల సదస్సుకు రావాల్సిందిగా సింగపూర్ కంపెనీలను సీఎం చంద్రబాబు ఆహ్వానించారు. ఈ సందర్భంగాసీఎంచంద్రబాబుమాట్లాడుతూ అమరావతి రాజధాని మాస్టర్ ప్లాన్ కోసం 2014లో సింగపూర్ దేశానికి వచ్చాను.
ఉచితంగా మాస్టర్ ప్లాన్ రూపొందించి ఇచ్చారు.గత ఐదేళ్ల కాలంలో జరిగిన పరిణామాలతో సింగపూర్ ప్రభుత్వంతో ఏపీ సంబంధాలు దెబ్బితిన్నాయి. ప్రస్తుత పర్యటన ద్వారా వాటి పునరుద్దరణకు అత్యధిక ప్రాధాన్యతను ఇస్తున్నాను.సింగపూర్ అవినీతి రహిత దేశం.అందుకే నాకు సింగపూర్ అంటే అభిమానం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో హైదరాబాద్ సమీపంలో సింగపూర్ టౌన్ షిప్ నిర్మించారు.సింగపూర్ కంపెనీలు ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకురావాలి.నవంబరు 14-15 తేదీల్లో విశాఖపట్టణంలో పెట్టుబడుల సదస్సు ఉంది. సింగపూర్ నుంచి డెలిగేషన్ ఆ పెట్టుబడుల సదస్సుకు రావాలి. విశాఖ సదస్సులో పెట్టుబడులపై ఎంఓయూలు కుదుర్చుకుందాం. అతి పెద్ద సుదీర్ఘ తీర ప్రాంతం ఏపీ సొంతం. భారత దేశం అతి వేగంగా అభివృద్ధి చెందుతుంది. గతంలో పీ3 అమలు చేశాం.. ఇప్పుడు పీ4 కార్యక్రమం ప్రారంభించాం. పేద-ధనిక మధ్య అంతరాలు తగ్గించడమే పీ4 ఉద్దేశ్యం. పేదలకు చేయూత ఇవ్వడమనేది ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా తీసుకోవాలి. పెట్టుబడులే కాదు.. పేదలకూ సాయం చేయాలని ఇదే వేదికగా కోరుతున్నానని ముఖ్యమంత్రి చెప్పారు.
ఏపీలో ఆకాశమే హద్దుగా అవకాశాలు
సింగపూర్ నుంచి స్పూర్తితో ఏపీని అభివృద్ధి చేస్తున్నాం. 2047కు స్వర్ణాంధ్ర సాధించాలనే లక్ష్యంతో ప్రజల సామాజిక, ఆర్ధిక పురోగతిపై పని చేస్తున్నాం. ఉద్యోగాల కల్పనలో సింగపూర్ ప్రభుత్వానిది అత్యుత్తమ మోడల్. సమీప భవిష్యత్తులో సంప్రదాయ విద్యుత్ వినియోగం నుంచి గ్రీన్ ఎనర్జీ వినియోగానికి మారుతాం. ఇన్వెస్టర్ ఫ్రెండ్లీగా ఉండటంతో పాటు పెట్టుబడులకు భద్రత ఉంటుంది. అమరావతి, విశాఖ, తిరుపతి లాజిస్టిక్ కారిడార్లు ఏర్పాటు అవుతున్నాయి. పెట్టుబడి దారులకు అవసరమైన నైపుణ్యమున్న వర్క్ ఫోర్స్ అందుబాటులో ఉంచేలా చూస్తున్నాం. పరిశోధనలకు, ఫ్యూచర్ టెక్నాలజీ కోసం అమరావతి క్వాంటం వ్యాలీని ఏర్పాటు చేస్తున్నాం. జాతీయ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ లో భాగంగా ఏపీ నుంచే మూడో వంతు గ్రీన్ ఎనర్జీని ఉత్పత్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నాం. పారిశ్రామికాభివృద్ధి కోసం 24 థీమాటిక్ పాలసీలు రూపొందించాం. తక్కువ వ్యయంతో రవాణా, సర్క్యులర్ ఎకానమీని అమలు చేయడం ద్వారా సుస్థిర భవిష్యత్తు దిశగా అడుగులు వేస్తున్నాం.
ఎలక్ట్రానిక్ మొబిలిటీ, వేస్ట్ రీసైకిలింగ్, ప్రైవేట్ ఇండస్ట్రియల్ పార్కులు, ఏరోస్పేస్, డిఫెన్స్, ఫుడ్ ప్రాసెసింగ్, ఎంఎంస్ఎంఈ, మారిటైమ్, మైనర్ మినరల్, స్పోర్ట్స్, టెక్స్ టైల్ పాలసీలు రూపొందించాం. పర్యాటక రంగానికి పారిశ్రామిక హోదా ఇచ్చాం. ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ కంపోనెంట్స్, డేటా సెంటర్, ఇన్నోవేషన్, స్టార్టప్ పాలసీలను అత్యుత్తమంగా తీర్చిదిద్దాం. ఆరు ఆపరేషనల్ పోర్టులు ప్రస్తుతం ఏపీలో అందుబాటులో ఉన్నాయి. త్వరలోనే మరో 4 పోర్టులు కూడా త్వరలో అందుబాటులోకి వస్తాయి. దేశంలోని మారిటైమ్ కార్గోలో 30 శాతం ఏపీ నుంచే జరుగుతోంది. మారిటైమ్ కార్గో రంగంలో ఏపీకి ఎంతమేర అవకాశాలు ఉన్నాయో మీరే ఊహించుకోవచ్చు. ఏపీకి అనుబంధంగా ఉన్న రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున పోర్టు కార్గో హ్యాండ్లింగ్ కు అవకాశం ఉంది. ఏపీలో 7 ఆపరేషనల్ ఎయిర్ పోర్టులు ఉన్నాయి. అలాగే మరో 9 ప్రాంతాల్లో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టుల నిర్మాణం కూడా చేయాలని భావిస్తున్నాం. ఇన్నోవేషన్ సహా విమానాల మరమ్మత్తులు, నిర్వహణ, ఓవర్ హాలింగ్ రంగాల్లోనూ పెట్టుబడులను ఆకర్షించేలా విధానాలు రూపోందించాం. ఇన్ ల్యాండ్ వాటర్ వేస్, రైల్ కార్గో లాంటి సదుపాయాలు కూడా ఏపీలో ఉన్నాయి. తక్కువ వ్యయంతో రవాణా అన్నదే మా లక్ష్యం. తద్వారా ఎగుమతులు, దిగుమతులకు పెద్ద ఎత్తున అవకాశాలు ఉన్నాయని చంద్రబాబు వివరించారు.
ఆంధ్రా- సింగపూర్ స్టార్టప్ ఫెస్టివల్
ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రసంగం తర్వాత జరిగిన ముఖాముఖిలో కొన్ని కీలక అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. సింగపూర్-ఏపీ స్టార్టప్ ఫెస్టివల్ నిర్వహిస్తే.. యువ పారిశ్రామిక వేత్తలకు చాలా ఉపయోగకరంగా ఉంటుందనే ప్రతిపాదన వచ్చింది. దీనిపై సీఎం చంద్రబాబు సానుకూలంగా స్పందించారు. స్టార్టప్ కంపెనీలకు తాము ఎప్పుడూ అనుకూలంగానే ఉంటామని స్పష్టం చేశారు. పారిశ్రామిక వేత్తల నుంచి వచ్చిన ప్రతిపాదన మేరకు సింగపూర్-ఏపీ స్టార్టప్ ఫెస్టివల్ నిర్వహాణకు తాము సిద్దంగా ఉన్నామని సీఎం స్పష్టం చేశారు.ఈ రోడ్ షోలో మంత్రులు లోకేష్, నారాయణ,టీజీ భరత్, ఏపీ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Authored by: Vaddadi udayakumar