తిరుమల,ఐఏషియ న్యూస్: కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం తిరుమల శ్రీవారి ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె ఆలయంలో శ్రీవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి సేవలో పాల్గొన్నారు. తిరుమలకు చేరుకున్న నిర్మల సీతారామన్ కు టీటీడీ అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి స్వాగతం పలికారు. అనంతరం శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శన ఏర్పాట్లు చేశారు.
దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆమెకు వేదాశీర్వచనం చేశారు. తీర్థ ప్రసాదాలు, శ్రీవారి ఫోటోను అందజేశారు. తిరుమలలోని వివిధ ప్రాంతాల్లో భక్తులకు శ్రీవారి సేవకులు అందిస్తున్న సేవలను నిర్మలా సీతారామన్ పరిశీలించారు. వారి సేవలు అమోఘమని కొనియాడారు. అనంతరం మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద కేంద్రంలో అన్న ప్రసాదం స్వీకరించారు.అన్న ప్రసాద కేంద్రం వద్దకు చేరుకున్న నిర్మల సీతారామన్ కు టీటీడీ పాలక మండలి సభ్యులు సుచిత్ర ఎల్లా, భానుప్రకాష్ రెడ్డి, సీహెచ్ వెంకయ్య చౌదరి స్వాగతం పలికారు. భోజనశాల వద్ద శ్రీవారి సేవకులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా భక్తులకు స్వయంగా అన్న ప్రసాదాలను వడ్డించారు. అన్న ప్రసాదం స్వీకరించిన అనంతరం ఆమె టీటీడీ ఫీడ్ బ్యాక్ పుస్తకంలో తన అభిప్రాయాన్ని లిఖితపూర్వకంగా తెలియజేశారు.
Authored by: Vaddadi udayakumar