- డేటా సెంటర్ పై ప్రజల నుంచి వస్తున్న ప్రశ్నలనే ప్రభుత్వం ముందు ఉంచాము
- వాటికి సమాధానం చెప్పలేక నారా లోకేష్ ఎగతాళి వ్యాఖ్యలు
- నేను హేళన చేయడం మొదలు పెడితే లోకేష్ తట్టుకోలేడు
- గుగూల్‌తో రాష్ట్ర ప్రయోజనాలకు అనుగుణంగా ఒప్పందం చేసుకోవాలి
- వైయస్సార్సీపీ అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు,మాజీ మంత్రి గుడివాడ అమర్నాధ్ డిమాండ్
విశాఖపట్నం,ఐఏషియ న్యూస్: విశాఖపట్నంలో గూగుల్ డేటా సెంటర్ పై తాను సబ్జెక్ట్ మాట్లాడుతుంటే మంత్రి నారా లోకేష్ మాత్రం నాపై వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖపట్నం వైయస్సార్సీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ… ప్రజల నుంచి వస్తున్న ప్రశ్నలనే ప్రభుత్వం ముందు ఉంచానని.. వాటికి సమాధానం చెప్పలేకే లోకేష్ ఎగతాళిగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. నేను హేళన చేయడం మొదలు పెడితే లోకేష్ తట్టుకోలేడని హెచ్చరించారు. రాష్ట్ర ప్రయోజనాలకు అనుగుణంగానే గుగూల్‌తో ఒప్పందం చేసుకోవాలని డిమాండ్ చేశారు.
రాష్ట్ర ప్రయోజనాలపై స్పష్టత ఏదీ ?
విశాఖపట్నంలో డేటా సెంటర్ ఏర్పాటు కోసం రూ.22వేల కోట్ల రాయితీలిస్తున్న ప్రభుత్వం.. సంస్థ ఏర్పాటు ద్వారా రాష్ట్రానికి వచ్చే ప్రయోజనాలమీద మాత్రం స్పష్టతనివ్వడం లేదు. డేటా సెంటర్ ఏర్పాటు వల్ల రానున్న ఉద్యోగ అవకాశాలు, పెరగనున్న రాష్ట్ర ఆదాయాలపై ప్రజలు, నిపుణుల్లో అనేక సందేహాలు నెలకున్నాయి. వాటికి సమాధానం చెప్పాలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుంటే.. స్పందించడం లేదు సరికదా లోకేష్ నాపై వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారు. డేటా సెంటర్ వల్ల 200 ఉద్యోగాలు వస్తాయని.. కేబినెట్ మీటింగ్ లోనూ, ఎస్ ఐపీబీలో చెబితే.. అదే టీడీపీ అనుకూల పత్రికల్లో కూడా రాశారు. ఇవాళ టీడీపీ నేతలు 1.90 లక్షల ఉద్యోగాలొస్తాయని ప్రచారం చేసుకుంటున్నారు. ఒక రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రయోజనాలను పక్కనపెట్టి.. ఒక సంస్థకు పెద్ద ఎత్తున భూములు, ఇతర రాయితీలు కల్పిస్తున్నప్పుడు ఒకటి మన రాష్ట్రానికి ఉపయోగం, నిరుద్యోగ యువతకు ఏ మేరకు ఉపాధి అవకాశాలు కల్పిస్తారు? రెండోది రాష్ట్రానికి వచ్చే ఆదాయం ఎంతన్నది ప్రధానమైన అంశాలు. గతంలో జరిగిన ఎస్ఐపీబీ, కేబినెట్ మీటింగ్ లో రైడన్ అనే సంస్థ ద్వారా 1గిగా వాట్ గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు చేసే క్రమంలో 200 మందికి ఉపాధి కల్పిస్తున్నామని ప్రభుత్వం చెప్పిన విషయాన్ని వారి అనుకూల పత్రికల్లోనే రాశారు. అయితే లోకేష్ తోపాటు మిగిలిన మంత్రులందరూ కూడా 1.90 వేల మందికి ఉపాధి అవకాశాలు కల్పించబోతున్నామని చెబుతున్నారు. నాకున్న సమాచారం మేరకు గూగుల్ కి ప్రపంచవ్యాప్తంగా ఉన్న డెవలప్ మెంట్ సెంటర్లు, డేటాసెంటర్లు, రీసెర్చ్ సెంటర్లలో కలిపి పూర్తిగా ఉన్న ఉద్యోగాలు దాదాపు 1.87 లక్షల మంది ఉన్నారు. అలాంటప్పుడు విశాఖలో రానున్న గూగుల్ డేటా సెంటర్ ద్వారా 1.90 వేల ఉద్యోగాలు వస్తాయని మంత్రులు ఎలా క్లెయిమ్ చేస్తున్నారు. దీనిపై మేం ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే మంత్రి లోకేష్ నన్ను వ్యక్తిగతంగా హేళన చేస్తున్నాడు.నేను హేళన చేయడం మొదలు పెడితే నువ్వు తట్టుకోలేవు లోకేష్.
గూగుల్ సంస్ధతో ప్రకటన ఇప్పించగలరా ?
మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఎన్ని లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయో గూగుల్ తో ప్రకటన చేయించగలరా? మీరు గూగుల్ తో ఆ ప్రకటన చేయిస్తే విశాఖ వాసిగా నేనే సత్కరిస్తాను. మీరు చెప్పిన మాటలు నమ్మశక్యంగా లేవు. నిజానికి డేటా సెంటర్ ఏర్పాటుకు బాటలు వేసిందే వైఎస్సార్స్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. వైయస్.జగన్ ప్రభుత్వ హయాంలోనే ఆదాని సంస్థని డేటా సెంటర్ ఏర్పాటుతో పాటు, ఐటీ పార్కు ఏర్పాటుకు కూడా ఒప్పించాం. మా ప్రశ్నలకు సమాధానం చెప్పలేక వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారు. ప్రజలు నిజా నిజాలు తెలుసుకోవాలని అమర్నాథ్ పేర్కొన్నారు.
Authored by: Vaddadi udayakumar