విశాఖపట్నం,ఐఏషియ న్యూస్: పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం ఏకలవ్య బాలికల గురుకుల పాఠశాలలో అస్వస్థతకు గురై కేజీహెచ్ లో చికిత్స పొందుతున్న విద్యార్థినులను హోంమంత్రి అనిత పరామర్శించారు. బాధితులతో ఆమె మాట్లాడారు. వారి ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో హోం మంత్రి అనిత మాట్లాడారు.
బాధిత విద్యార్థులకు మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయని, దీనిపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టారని, వైద్యు నిపుణులతో ఓ కమిటీ వేశామని తెలిపారు.ఈ ఘటనపై సమగ్ర విచారణ జరుగుతోందన్నారు.పాఠశాలల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెప్పారు. గత ప్రభుత్వంలో ఇద్దరు గిరిజనులు డిప్యూటీ సీఎంలు అయ్యారని, కనీసం ఒక్కసారైనా ఆశ్రమ పాఠశాలలను సందర్శించారా అని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వంలో మంత్రులమంతా నిరంతరం పర్యవేక్షిస్తున్నామన్నారు. అధికారులు కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ పరిశీలిస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలో మహిళల భద్రతకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని స్పష్టం చేశారు.జగన్ హయాంలో కల్తీ మద్యంతో ఎంతోమంది ప్రాణాలను తీశారని అన్నారు. వైసీపీ హయాంలో జంగారెడ్డిగూడెంలో కల్తీ మద్యంతో పలువురు ప్రాణాలు కోల్ఫోయారని గుర్తుచేశారు. ప్రజల ఆరోగ్యం గురించి మాట్లాడే నైతిక హక్కు జగన్ మోహన్ రెడ్డికి లేదని మంత్రి అనిత ధ్వజమెత్తారు.
Authored by: Vaddadi udayakumar