హైదరాబాద్,ఐఏషియ న్యూస్బ్యూరో: హైదరాబాద్ నగరం ఎప్పుడూ పండుగల రంగుల హరివిల్లులా ఉంటుంది. ఏ పండుగ వచ్చినా అది పెద్దగా హడావుడి చేస్తుంటారు. ముఖ్యంగా వినాయక చవితి వస్తే ప్రతి వీధి, ప్రతి ఇల్లు కొత్త ఉత్సాహంతో కళకళలాడుతుంది. ఈసారి కూడా అదే ఉత్సాహం కనిపిస్తోంది. కానీ ఈసారి పండుగ ఉత్సవాలకు ఓ ప్రత్యేకత ఉంది. నగర ప్రజలకు హెచ్‌ఎండీఏ ఓ శుభవార్త చెప్పింది.గతంలో ప్లాస్టర్ ఆఫ్ పారిస్ (పిఓ పి) విగ్రహాలు జలవనరులను తీవ్రంగా కలుషితం చేశాయి. ట్యాంక్ బండ్, హుస్సేన్ సాగర్, ఇతర చెరువులు రసాయనాల వలన కలుషితమై.. చేపలు, నీటిలో ఉండే జీవులు చనిపోతున్న సంఘటనలు చాలా వరకు జరిగాయి. ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని హెచ్‌ఎండీఏ 2017 నుంచే పర్యావరణానుకూల మట్టి గణేష్ విగ్రహాల పంపిణీ కార్యక్రమం ప్రారంభించింది. ప్రజల్లో చైతన్యం పెంచి, పండుగను పచ్చదనం వైపు మళ్లించేందుకు ఇది పెద్ద అడుగుగా చెప్పుకోవచ్చు.ఈ ఏడాది కూడా అదే బాటలో భాగంగా నగర వ్యాప్తంగా 34 కేంద్రాల్లో విగ్రహాలను ఉచితంగా అందజేయనున్నారు. ఆగస్టు 24 నుంచి 26 వరకు లక్షకు పైగా విగ్రహాలను అందుబాటులోకి తెచ్చే ప్రణాళిక సిద్ధమైంది. జూబ్లీహిల్స్‌లోని పార్కులు, బంజారాహిల్స్, హైటెక్ సిటీ, అమీర్‌పేట, సికింద్రాబాద్, మాదాపూర్, ఉప్పల్, వనస్థలిపురం, సరూర్‌నగర్ వంటి ప్రదేశాల్లో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు. అంతే కాదు.. పెద్ద కాలనీలు, గేటెడ్ కమ్యూనిటీలకు మొబైల్ వాహనాల ద్వారా నేరుగా విగ్రహాలను అందజేస్తారు.
Authored by: Vaddadi udayakumar