తాడేపల్లి,ఐఏషియ న్యూస్: విజయవాడలోని రాణిగారి తోట ప్రాంతంలో ఏర్పాటు చేసిన గణేశ్ విగ్రహం వద్దకు వెళ్లి పూజ నిర్వహించాలని మొదట మాజీ సీఎం వైఎస్ జగన్ భావించారు. అయితే బుధవారం నగరంలో ఎడతెరపి లేకుండా భారీ వర్షం కురుస్తోంది. దీంతో జగన్ నగరంలోకి వెళ్లి గణేష్ పూజలో పాల్గొనే పరిస్ధితి లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో పరిస్ధితిని గ్రహించిన జగన్ తాడేపల్లిలో తన ఇంట్లోనే గణేష్ పూజకు ఏర్పాట్లు చేయించారు. అక్కడే ఆయన గణేష్ పూజ చేశారు. దీంతో జగన్ పంతం నెగ్గినట్లయింది.తిరుమల డిక్లరేషన్ పేరుతో టీడీపీ మొదలుపెట్టిన ప్రచారం సద్దుమణిగినా జగన్ చివరి నిమిషంలో ప్లాన్ మార్చుకున్నారనే మరో ప్రచారం చక్కర్లు కొడుతోంది. ఇలాంటి సమయంలో ఇంట్లోనే వినాయక చవితి సందర్బంగా గణేశ్ పూజ నిర్వహించడం ద్వారా జగన్ ఆ ప్రచారాలకు కౌంటర్ ఇచ్చారనే చర్చ జరుగుతోంది. ఇవాళ జగన్ గణేష్ పూజ నిర్వహించడంతో అప్పటి వరకూ ఆయనపై వచ్చిన విమర్శలకు చెక్ పడినట్లయింది.ఈ నెలలో ఆగస్టు 15 వేడుకల్లో పాల్గొనకుండా దూరంగా ఉన్న జగన్ ఈసారి అలాంటి పొరపాట్లకు తావివ్వకుండా గణేష్ పూజలో పాల్గొనడంతో వైసీపీ అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి వేల్లంపల్లి శ్రీనివాస్ మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు,ఎమ్మెల్సీలు తలసిల రఘురాం, లేళ్ల అప్పిరెడ్డి, మాజీ ఎంపీ నందిగం సురేష్, వైసీపీ నాయకులు దేవినేని అవినాష్, పోతిన వెంకట మహేష్ తదితరులు పాల్గొన్నారు.
Authored by: Vaddadi udayakumar