అమరావతి చాన్విక జ్యోతిన్యూస్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సుప్రీం కోర్టు భారీ ఊరట ఇచ్చింది. దుర్గగుడి ఆలయ భూముల్లో విజయవాడ ఉత్సవ్ నిర్వహణపై విపక్ష వైసీపీ నేతలు, కొన్ని హిందూ సంఘాలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఆ పిటిషన్‌ను తోసిపుచ్చి.. “విజయవాడ ఉత్సవ్”ను ఎలాంటి అడ్డంకులు లేకుండా నిర్వహించవచ్చని గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.కాగా మొదట హైకోర్టు సింగిల్ బెంచ్, ఆలయ భూముల్లో వ్యాపార సంబంధిత కార్యక్రమాలు జరగకూడదని ఆదేశాలు ఇచ్చింది. దీన్ని సవాల్ చేస్తూ ప్రభుత్వం హైకోర్టు ద్విసభ్య ధర్మాసనాన్ని ఆశ్రయించింది. ఆ ధర్మాసనం సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై స్టే విధించింది. దీంతో అసంతృప్తి చెందిన హిందూ సంఘాలు నేరుగా సుప్రీంకోర్టుకు వెళ్లాయి. అక్కడ విచారణ చేపట్టిన ధర్మాసనం, పిటిషనర్ల వాదనలను తిరస్కరించి, అసలు వాదనలకు ఆధారమే లేదని వ్యాఖ్యానించింది.
ప్రపంచపు అతిపెద్ద కార్నివాల్..
ఇక కోర్టు తీర్పుతో ఇక నిర్వాహకులకు ఎలాంటి అడ్డంకులు లేవని హర్షం వ్యక్తం చేస్తున్నారు. విజయవాడలో “వరల్డ్ బిగ్గెస్ట్ ఫెస్టివ్ కార్నివాల్”ను నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అందులో భాగంగా మొత్తం 286 ఈవెంట్స్ నిర్వహించేందుకు ప్లాన్ చేశారు. కూచిపూడి, భరతనాట్యం వంటి క్లాసికల్ డాన్స్ ప్రదర్శనలు.. డ్రోన్ షోలు, ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించనున్నారు. అలానే ఆహార ప్రియుల కోసం ప్రత్యేక ఫుడ్ స్టాల్స్ సైతం నిర్వహించనున్నారు.
శరన్నవరాత్రి సందర్భంగా 11 రోజుల వేడుకలు
శరన్నవరాత్రి పర్వదినాలను పురస్కరించుకుని ఈ ఉత్సవాన్ని 22 నుంచి అక్టోబర్ 2 వరకు నిర్వహించనున్నారు. 11 రోజులపాటు జరిగే ఈ వేడుకల్లో సాంస్కృతిక వైభవం, ఆధ్యాత్మికత, ఆధునికత కలగలసిన ప్రదర్శనలు ఉండనున్నాయి. ఈ ఉత్సవాన్ని ప్రపంచస్థాయిలో నిర్వహించేందుకు స్థానిక ఎంపీ కేశినేని చిన్ని,మంత్రి కొల్లు రవీంద్ర, స్వచ్ఛాంద్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరాం సన్నాహాలు చేస్తున్నారు.ఈ భారీ ఉత్సవం విజయవాడకు సాంస్కృతిక, ఆధ్యాత్మిక, పర్యాటక రంగాల్లో ప్రపంచస్థాయి గుర్తింపు తీసుకురావడం ఖాయమని నిర్వాహకులు నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.
Authored by: Vaddadi udayakumar