ఎక్స్ వేదికగా స్పందించిన టిటిడి చైర్మన్ డిఆర్ నాయుడు
తిరుమల,ఐఏషియ న్యూస్: ఏడు కొండలపై కొలువైన తిరుమల వెంకన్న దర్శనానికి వచ్చే భక్తులకు ఇచ్చే లడ్డూ ప్రసాదం ధర పెరగబోతున్నట్లు తాజాగా వార్తలు వచ్చాయి. ఈ మేరకు టీటీడీ ప్రయత్నాలు ప్రారంభించినట్లు ఈ వార్తల సారాంశం. ప్రపంచవ్యాప్తంగా ఎంతో పవిత్రంగా భావించే లడ్డూ ప్రసారం ధర పెరుగుతుందన్న అంచనాలతో డిమాండ్ కూడా భారీగా పెరిగింది. మరోవైపు లడ్డూ ప్రసాదం రేట్లు పెంచడమేంటన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. దీనిపై టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు స్పందించారు.తిరుపతి లడ్డూ ప్రసాదం ధర పెరుగుతోందంటూ జరుగుతున్న ప్రచారంపై టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు తీవ్రంగా స్పందించారు. ఈ మేరకు ఆయన ఎక్స్ లో ఓ పోస్టు పెట్టి క్లారిటీ ఇచ్చేశారు.తిరుమల తిరుపతి దేవస్థానాలు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క ప్రతిష్టను దెబ్బతీయడానికికొన్ని బాధ్యతారహితమైన మీడియా ఛానెల్‌లు ప్రయత్నిస్తున్నాయని ఆయన ఆరోపించారు. పవిత్రమైన తిరుపతి లడ్డూ ధరను పెంచాలని టిటిడి ఆలోచిస్తోందని తప్పుడు నివేదికలు వచ్చాయని ఛైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. ఈ మీడియా నివేదికలు పూర్తిగా నిరాధారమైనవి, తప్పుడువని ఆయన పేర్కొన్నారు. ఈ తప్పుడు మీడియా నివేదికలను తాను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. అలాగే లడ్డూ ప్రసాదం ధరలను పెంచే ప్రణాళిక టిటిడికి లేదని పునరుద్ఘాటిస్తున్నానని వెల్లడించారు. దీంతో లడ్డూ ప్రసాదం ధర పెంపుపై జరుగుతున్న ప్రచారానికి చెక్ పెట్టినట్లయింది.
Authored by: Vaddadi udayakumar