- ప్రమాణ స్వీకారం చేయించిన బొంబే హైకోర్టు చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే
- భారీగా హాజరైన కేంద్ర,ఏపీ మంత్రులు అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న
ఏపీ చీఫ్ బ్యూరో,ఐఏషియన్ న్యూస్: ఏపీ రాజకీయాల్లో నాలుగు దశాబ్దాల పాటు వివిధ పదవుల్లో పనిచేసిన సీనియర్ నేత అశోక్ గజపతిరాజు శనివారం గోవా గవర్నర్ గా బాధ్యతలు చేపట్టారు. గోవా రాజ్ భవన్ లో జరిగినకార్యక్రమంలో అశోక్ గజపతిరాజు గవర్నర్ గా ప్రమాణ స్వీకారం చేశారు. అట్టహాసంగా జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు ఎంపీలు, కేంద్రమంత్రులు, ఏపీ మంత్రులు, రాజకీయ నేతలు,అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు హాజరయ్యారు.కేంద్ర ప్రభుత్వం తాజాగా అశోక్ గజపతిరాజును గోవా గవర్నర్ గా నియమించింది. దీంతో బోంబే హైకోర్టు ఛీఫ్ జస్టిస్ అలోక్ అరాధే ఇవాళ గోవా రాజ్ భవన్ లోని దర్బార్ హాల్లో ఆయనతో గవర్నర్ గా ప్రమాణస్వీకారం చేయించారు. ఇంగ్లీష్ లోనే గవర్నర్ గా అశోక్ గజపతిరాజు ప్రమాణస్వీకారం చేశారు. అనంతరం ఆయన్ను ఛీఫ్ జస్టిస్ అభినందించారు.ఈ కార్యక్రమానికి తెలుగు వారు భారీగా హాజరయ్యారు.ముందుగానే అపాయింట్మెంట్లు తీసుకున్న వీరంతాప్రమాణస్వీకారాన్ని నేరుగా తిలకించారు.కేంద్ర పౌర విమానయానమంత్రి రామ్మోహన్ నాయుడు, ఏపీ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు ,రాష్ట్రమంత్రులు నారా లోకేష్,గుమ్మిడి సంధ్యారాణి, కొండపల్లి శ్రీనివాస్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుతో పాటు పలువురు నేతలు ఈ కార్యక్రమానికి హాజరై అశోక్ గజపతిరాజుకు అభినందనలు తెలిపారు. టీడీపీ జాతీయ అధ్యక్షుడు, సీఎం చంద్రబాబు ఇవాళ సింగపూర్ టూర్ కు వెళ్తుండటంతో ఈ కార్యక్రమానికి రాలేకపోయారు.దీంతో లోకేష్ సహా పలువురు మంత్రుల్ని పంపారు.అలాగే అశోగ్ గజపతిరాజు కుటుంబ సభ్యులు కూడా ఈ కార్యక్రమాానికి హాజరయ్యారు.ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి, ఎంపీ, కేంద్రమంత్రిగా నాలుగు దశాబ్దాల పాటు పనిచేసిన అశోక్ గజపతిరాజును చంద్రబాబు సిఫార్సుతో కేంద్రం గోవా గవర్నర్ గా నియమించింది. రాజకీయాల్లో మర్యాదస్తుడిగా పేరున్న అశోక్ గజపతిరాజును గవర్నర్ గా పంపడంతో ఏపీ ప్రతిష్ఠ జాతీయ స్దాయిలో పెరిగినట్లయింది. అలాగే రాజకీయంగా ప్రాధాన్యత తగ్గిన దశలో ఉన్న అశోక్ గజపతిరాజుకు కూడా గౌరవప్రదమైన పదవి లభించినట్లయింది.
Authored by: Vaddadi udayakumar