- అవకతవకలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం
- వారం రోజుల్లో మరింత యూరియా రాష్ట్రానికి చేరుకోనుందని వెల్లడించిన మంత్రి అచ్చెన్నాయుడు
అమరావతి,ఐఏషియ న్యూస్: రాష్ట్రంలో ఎరువులు ఎటువంటి కొరత లేకుండా అందుబాటులో ఉన్నాయని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టంచేశారు. రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. విజయవాడలోని క్యాంప్ ఆఫీస్ లో మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రస్తుతం యూరియా, డీఎపి, పొటాష్, కాంప్లెక్స్ ఎరువులు సహా అన్నిరకాల ఎరువులు సరిపడా నిల్వలుగా ఉన్నాయని తెలిపారు. జిల్లా వారీగా ఎరువుల నిల్వలను పరిశీలిస్తూ, కలెక్టర్లు, వ్యవసాయ శాఖాధికారులతో ప్రతిరోజూ సమీక్షలు జరుగుతున్నాయని అన్నారు. మార్కెట్‌లో ఎరువుల కొరత లేకుండా, రైతుల అవసరాలకు అనుగుణంగా సరఫరాలు కొనసాగుతున్నాయని స్పష్టం చేశారు. రైతుల కోసం కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా నిలుస్తుందని, ఒక్క రైతు కూడా ఇబ్బందులు పడకుండా చూడటమే లక్ష్యమని మంత్రి పేర్కొన్నారు. రైతు సంతోషంగా ఉంటేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. అందుకే రైతుల సమస్యల పరిష్కారం మా మొదటి కర్తవ్యం అని మంత్రి స్పష్టం చేశారు. ఎరువుల కొరత పేరుతో రైతులను మోసం చేయాలనుకునే డీలర్లు, డిస్ట్రిబ్యూటర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రైతుల సమస్యలు వెంటనే పరిష్కరించేలా జిల్లా కలెక్టర్లు, వ్యవసాయ శాఖాధికారులు 24 గంటలు పనిచేస్తున్నారని తెలిపారు.రాష్ట్రంలోని సహకార సంస్థలు, రైతు సేవా కేంద్రాలు, ప్రైవేట్ వ్యాపారుల వద్ద 82,054 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉందని తెలిపారు. వివిధ పోర్టుల నుండి మరియు తయారీ సంస్థల నుండి 29,236, మెట్రిక్ టన్నుల యూరియా జిల్లాలకు రవాణా దశలో ఉందన్నారు. 1,06,412 మెట్రిక్ టన్నుల యూరియా పలు పోర్టులు, తయారీ సంస్థల ద్వారా రాష్ట్రానికి సెప్టెంబర్ నెలాఖరకు చేరుకుంటాయన్నారు. రైతుల అవసరాలను గుర్తించిన కేంద్రం గురువారం రాష్ట్రానికి మరో 24,894 మెట్రిక్ టన్నుల యూరియాను కేటాయించారని, ఈనెల 15 తేదీ నుండి 22వ తేదీ లోపు విశాఖ పోర్టుకు యూరియా చేరుకుంటుందని తెలిపారు. ఈ యూరియా నిల్వలతో కరీఫ్ సీజన్ కు సరిపడా యూరియా అందరికి లభిస్తుందని, రాష్ట్రంలో ఎక్కడా కూడా యూరయా కొరత అనే మాట వినిపించదన్నారు.సీఎం చంద్రబాబు నాయుడు చొరవ ఫలితమే ఈ కేటాయింపన్నారు.వైసీపీ హయాంలో ఎరువుల కొరత రైతుల ఆందోళనలు తప్పితే రైతు సంక్షేమాన్ని మరిచారని మండిపడ్డారు. రైతు కష్టాన్ని అర్థం చేసుకున్న ఏకైక నాయకుడు చంద్రబాబని కొనియాడారు. కేంద్రం సహకారానికి రాష్ట్ర ప్రజల తరఫున మంత్రి అచ్చెన్న కృతజ్ఞతలు తెలియజేశారు.
Authored by: Vaddadi udayakumar