9న సింహగిరి ప్రదక్షిణ ప్రారంభం
లక్షలాది సంఖ్యలో పాల్గొననున్న భక్త జనం
చదరం రమేష్ ప్రత్యేక ప్రతినిధి
సింహాచలం( విశాఖపట్నం): ఉత్తరాంధ్ర ప్రజల ఇలవేల్పు,ఆరాధ్య దైవం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖ జిల్లా సింహాచలం సింహాగిరి శిఖరంపై కొలువైయున్న శ్రీ వరహలక్ష్మి నృసింహ స్వామి వారిని ఉత్తరాంధ్ర ప్రాంతాలతో పాటు యావత్ దేశంలోని పలు రాష్ట్రాల భక్తుల కొంగుబంగారంగా సింహాద్రి అప్పన్న స్వామిని కొలుస్తుంటారు. దేశంలోని తెలంగాణ, ఒడిస్సా,పశ్చిమ బెంగాల్‌లో ఉండే భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తుంటారు. ఈ సింహాద్రి అప్పన్న స్వామి ఆలయంలో ఆషాడ పౌర్ణమి అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించే గిరిప్రదక్షిణలో పాల్గొనేందుకు లక్షలాదిమంది భక్తులు విశాఖ చేరుకుంటారు. సింహాద్రి అప్పన్న గిరి ప్రదర్శన ఈనెల 9, 10 వ తేదీలు మంచి ముహూర్తం అని సింహాచలం దేవస్థానం అధికారులు వెల్లడించారు.ఈ సందర్భంగా సింహాచలం గిరిప్రదర్శన రూట్ మ్యాప్‌ను సైతం అధికారులు విడుదల చేశారు. ఈ గిరిప్రదక్షణకు సుమారు ఐదు నుంచి ఆరు లక్షల మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో తొలి పావంచ వద్ద కొబ్బరికాయలు కొట్టే మార్గంలో అధికసంఖ్యలో క్యూలైన్లు, కొబ్బరికాయలు కొట్టే ప్రదేశాలు ఎక్కువగా ఏర్పాటు చేయాలని సింహాచలం దేవస్థానం అధికారులను విశాఖ జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ ఆదేశించారు. పారిశుధ్య మౌలిక సదుపాయాలు జీవీఎంసీ అధికారులు చేపట్టారు. ఈ మేరకు అధికారులు గిరి ప్రదక్షణ జరిగే ప్రాంతాలను మేయర్ పీలా శ్రీనివాసరావుతో సహా భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు పరిశీలించారు. అనంతరం సింహాచలం కొండపైకి వెళ్లే రెండు ఘాట్ రోడ్ల ప్రవేశ మార్గాలను, గిరి ప్రదర్శన రోడ్డు మార్గాన్ని పరిశీలించి భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ అధికారులు ను ఆదేశించారు.
గిరి ప్రదక్షణ రూట్ మ్యాప్
విశాఖ జిల్లా సింహాచలం క్షేత్రంలో గిరిప్రదక్షిణ మహోత్సవం అత్యంత వైభవోపేతంగా జరుగుతుంది. ఈ పవిత్రమైన గిరిప్రదక్షిణ కార్యక్రమంలో పాల్గొనేందుకు దేశం నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు తరలివస్తుంటారు. బుధవారం సాయంత్రం నాలుగు గంటలకు సింహాచలం దేవస్థానం తొలి పావంచ వద్ద కొబ్బరికాయ కొట్టి నడకను అధికారులు లాంఛనంగా ప్రారంభిస్తారు. భక్తులు అడవివరం,సెంట్రల్ జైలు, హనుమంత్ వాక,అప్పుఘర్,లుంబినిపార్కు,సీతమ్మధార ,కైలాసపురం,మాధవధార మాధవ స్వామి దేవాలయం పరిసరాలు, ఎన్ ఏ డి, గోపాలపట్నం మీదుగా సింహాచలం వరకు భక్తులు నడక మార్గాన గిరి ప్రదక్షిణ చేస్తారు. ఆషాఢ శుద్ధ చతుర్దశి నాటి రాత్రి కొండ దిగువన ఉన్న తొలి పావంచా దగ్గర నుంచి భక్తులు గిరి ప్రదక్షిణ మొదలు పెడతారు. కాలి నడకన సింహగిరి చుట్టూ భక్తులు 32 కిలోమీటర్లు మేరకు గిరి ప్రదక్షిణ చేస్తారు. గిరి ప్రదక్షిణం చేసిన భక్తులు ఆ మరునాడు పున్నమి నాడు ఆలయంలో అప్పన్న స్వామిని దర్శించుకుంటారు. ఈనెల 9 బుధవారం సింహాచలం గిరి ప్రదక్షిణ జరగనుంది. ఈ గిరి ప్రదక్షిణలో పాల్గొనేందుకు లక్షలాది మంది భక్తులు ఏడాది కాలంగా వేచి చూస్తుంటారు. సింహాచలం గిరిప్రదర్శనకు సంబంధించిన రూట్ మ్యాప్‌ను సింహాచలం దేవస్థానం అధికారులు విడుదల చేసిన సంగతి తెలిసిందే.మనసులోని కోర్కెలు నెరవేరుతాయని భక్తుల ప్రతీతి.సింహాద్రి అప్పన్నగా భక్తులచే పిలవబడే లక్ష్మీనరసింహస్వామి కొలువైన దివ్యక్షేత్రం సింహాచలం. దక్షిణ భారత దేశంలో కొలువైన వైష్ణవ క్షేత్రాల్లో ఈ దివ్యవక్షేత్రం చాలా పవిత్రమైంది. ఈ ఆలయానికి తిరుమల తర్వాత అంతటి ప్రాశస్త్యం ఉంది.ఆషాఢ పూర్ణిమను సింహాచలంలో గిరిపున్నమిగా కొలుస్తారు. అక్షయ తృతీయ నుంచి నాలుగు విడతలుగా చందన సేవను స్వీకరించిన సింహాద్రి అప్పన్నస్వామి గిరిపున్నమి నాటికి సంపూర్ణ రూపాన్ని ధరిస్తాడు. అందుకే పున్నమికి ముందురోజు సాయం కాలం నుంచి 32 కిలోమీటర్ల దూరం కాలి నడకన సింహాచల గిరి ప్రదక్షిణ చేసిన భక్తులు పున్నమినాడు స్వామి దర్శనం చేసుకుంటారు.ఈ ప్రదక్షిణలో పౌర్ణమి నాడు నిండు చందమామను పోలిన స్వామి పరిపూర్ణ రూపాన్ని దర్శించుకుని మనసులోని కోర్కెలు నెరవేరుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం.
పుష్పరథంపై గిరిప్రదక్షిణ
ఈనెల 9న ఆషాఢ పౌర్ణమి సందర్భంగా సింహాద్రి అప్పన్న గిరి ప్రదక్షిణ,10న తుది విడత చందన సమర్పణ ఉంటుందని ఆలయ అధికారులు వెల్లడించారు. 9న సాయంత్రం 3 గంటలకు కొండదిగువన తొలిపావంచా నుంచి పుష్పరథంపై గిరిప్రదక్షిణ ప్రారంభం కానుంది. భక్తుల రద్దీ దృష్ట్యా 9న రాత్రి 10 గంటల వరకు అప్పన్న దర్శనానికి భక్తులకు అనుమతినిస్తారు.10న ఢిల్లీ విజయోత్సవం పురస్కరించుకొని సాయంత్రం 4గంటల వరకే శ్రీవరాహలక్ష్మీనృసింహుడి దర్శనం కల్పిస్తారు.