
- 3.17 కోట్ల మంది మహిళలు ఉచిత బస్సులలో ప్రయాణం
- మహిళలకు 118 కోట్లు రూపాయల లబ్ధి
ఏపీ స్టేట్ బ్యూరో,ఐఏషియ న్యూస్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళల కోసం ఉచిత బస్సు పథకం అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. స్త్రీ శక్తి పథకం పేరుతో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నారు. పంద్రాగస్టు సందర్భంగా ఆగస్ట్ 15వ తేదీ స్త్రీ శక్తి పథకాన్ని విజయవాడలో జరిగిన ఓ కార్యక్రమంలో సీఎం నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. స్త్రీ శక్తి పథకం ప్రారంభించి నేటికి నెల రోజులు పూర్తి కాగా స్త్రీ శక్తి పథకం సూపర్ హిట్ అయ్యిందని ప్రభుత్వం చెప్తోంది. పథకం అమల్లోకి వచ్చిన నెల రోజుల వ్యవధిలో ఎంత మంది మహిళలు స్త్రీ శక్తి పథకం కింద ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణం చేశారు. ఎంతమేరకు వారికి లబ్ధి కలిగిందనే వివరాలను ఏపీ రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి వివరించారు.నెల రోజుల వ్యవధిలో ఆంధ్రప్రదేశ్‌వ్యాప్తంగా 3.17 కోట్ల మంది మహిళలు,బాలికలు స్త్రీ శక్తి పథకాన్ని ఉపయోగించుకున్నట్లు మంత్రి తెలిపారు. స్త్రీ శక్తి పథకం అమలుతో రాష్ట్రంలోని మహిళలు ఒక్క నెలలోనే 118 కోట్ల రూపాయలు లబ్ధి పొందారని మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి వివరించారు.మరోవైపు ఐదు రకాల బస్సులలో ఏపీ ప్రభుత్వం స్త్రీ శక్తి పథకం అమలు చేస్తోంది. పల్లెవెలుగు, అల్ట్రా పల్లెవెలుగు, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్,ఎక్స్‌ప్రెస్ బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నారు. భద్రత దృష్ట్యా తొలుత ఘాట్ రోడ్లకు అనుమతి ఇవ్వకున్నా.తర్వాత ఘాట్ రోడ్లలోనూ మహిళలకు ఉచిత బస్సు పథకం అమలు చేస్తున్నారు. ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఓటర్ కార్డు వంటి గుర్తింపు పత్రాలు చూపించి ఉచితంగా ప్రయాణించే వీలు కల్పించారు. త్వరలోనే వీటి స్థానంలో స్మార్ట్ కార్డులు ప్రవేశపెట్టే ఆలోచనలోనూ ప్రభుత్వం ఉంది.
మరోవైపు ఉచిత బస్సు పథకంలో భాగంగా గుర్తింపు కార్డులు చూపించిన వారికి ఆర్టీసీ సిబ్బంది జీరో ఫేర్ టికెట్లు జారీ చేస్తున్నారు. ఈ టికెట్ల మీద ఎక్కడి నుంచి ఎక్కడి వరకూ ప్రయాణించారు.ఎంతమంది ప్రయాణించారనే వివరాలతో పాటుగా ఉచిత బస్సు పథకం అమలుతో వారికి ఎంతమేరకు లబ్ధి కలిగిందనే వివరాలను కూడా ముద్రిస్తున్నారు.దీని ద్వారా ప్రభుత్వం అందిస్తున్న లబ్ధిమహిళలకుతెలుస్తుందనేదీ సర్కారు ఉద్దేశం. ఈక్రమంలోనే నెలరోజుల్లో 3.17 కోట్ల మంది మహిళలు ఉచిత బస్సులలో ప్రయాణించారని పథకం వలన రూ.118 కోట్ల మేరకు లబ్ధి పొందారని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి వెల్లడించారు.
Authored by: Vaddadi udayakumar
News Website (iasianews.net) I Asia News