- 7 కేజీల బంగారు ఆభరణాలు, బిస్కెట్లు: 12 కేజీల ల వెండి వస్తువులు బిస్కెట్లు
- 5 కోట్ల విలువైన కరెన్సీ నోట్లతో అమ్మవారి అలంకరణ
- 250 మంది మహిళలచే కోటికుంకుమార్చన
(వి వి ఆర్ ఎస్ ఆదిత్య)
విశాఖపట్నం,ఐఏషియ న్యూస్: విశాఖ ఓల్డ్ టౌన్ లో కురుపాం మార్కెట్ ప్రాంతంలో గల 148 సంవత్సరాల పురాతన కన్యకాపరమేశ్వరి అమ్మవారి ఆలయంలో శరన్నవరాత్రుల ఉత్సవాల్లో భాగంగా తొమ్మిదవ రోజు మంగళవారం నాడు అమ్మవారిని శ్రీమహాలక్ష్మి రూపంలో అలంకరణ చేసి భక్తులకు దర్శనం కలిగించినట్లు దేవస్థాన సంఘ అధ్యక్షులు ఆరిశెట్టి దినకర్, కార్యదర్శి పెనుగొండ కామరాజు తెలిపారు.ఈ సందర్భంగా తెల్లవారుజామున అమ్మవారి మూలవిరాట్ కు పాలు, పెరుగు, గంధం,తేనె వివిధ రకాల పండ్ల రసమలు వంటి 108 రకాల ద్రవ్యములుతో ప్రత్యేక అభిషేకం గావించి అమ్మవారిని వివిధ రకాల పూలతో సుందరంగా శ్రీమహాలక్ష్మి రూపంలో అలంకరించి స్వర్ణవస్త్రసహిత సకలాభరణములు,108 స్వర్ణపుష్పములతోనివేదనగావించారు.ఈసందర్భంగా ఆలయ గర్భగుడిలో సుమారు ఆరు కేజీల సకల స్వర్ణాభరణములు — బంగారు చీర, బంగారు కిరీటం, బంగారు పాదములు — బంగారం బిస్కెట్లు, పది కేజీల వెండి వస్తువులు వెండి బిస్కెట్లు తో పాటు నాలుగు కోట్ల విలువ చేసే కరెన్సీ ఒక రూపాయి నోటు నుండి 500 రూపాయలు నోట్లు వరకు అన్ని కరెన్సీ నోట్లతో చేసిన అలంకరణ చూసి భక్తులు తన్మయత్వం చెందారు. గర్భగుడి మొత్తం ధనాగారంగా మార్చివేసిన వైనం భక్తులను ఆకట్టుకుంది. ఈ సందర్భంగా శరన్నవరాత్రుల ఉత్సవ కమిటీ చైర్మన్ లు శ్రీయుతులు సురేష్ కుమార్,సుగ్గు శివ, కంకటాల సతీష్ లు మాట్లాడుతూ గత 23 సంవత్సరముల నుంచి శరన్నవరాత్రి ఉత్సవాల సమయంలో అమ్మవారిని మహాలక్ష్మి అవతార రూపంలో కరెన్సీ నోట్లు,బంగారు, వెండి ఆభరణాలతో అలంకరణ చేయడం జరుగుతుందని చెప్పారు.భక్తులు స్వయంగా అందజేసిన సొమ్ము, బంగారు ఆభరణాలతో ఈ అలంకరణ చేసినట్లు ఒక రోజు తరువాత ఆ సొమ్ము భక్తులకు వాపసు చేస్తామని చెప్పారు.
కరెన్సీతో అమ్మవారి అలంకరణ ఎందుకంటే
పూర్వం నుండి ఆర్యవైశ్యులు ప్రతిరోజు తమ వ్యాపార గృహాలకు వెళ్లే ముందు కొంత నగదు, తాళములు అమ్మవారి చెంత ఉంచి తీసుకొని వెళ్తే తమ వ్యాపార అభివృద్ధి జరుగుతుందని నమ్మేవారు. ఆ విధంగా వచ్చిన అలవాటుతో క్రమంగా దసరా నవరాత్రులలో ఒకరోజు అమ్మవారికి నగదుతో అలంకరణ చేయడం సుమారు 23 సంవత్సరాల క్రితం ప్రారంభించామన్నారు నిర్వాహకులు.ఆ విధంగా తమ సొమ్ము అమ్మవారి అలంకరణలో ఉంచినట్లయితే వ్యాపారులకు తమ వ్యాపార అభివృద్ధి, సామాన్య ప్రజానీకానికి ఆర్థిక పరిపుష్టి చేకూరుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం అని తెలిపారు.అనంతరం దేవస్థాన ఆస్థాన మండపంలో వేద పండితులు దేవీ భాగవతం, బాలా త్రిపుర సుందరి దేవి జపం, దేవి భాగవతం పారాయణం చేశారు. 250 మంది మహిళలచే కోటి కుంకుమార్చన జరిగింది. సాయంత్రం దేవాలయం మండపంలో శ్రీ బాలాత్రిపురసుందరి నృత్య నికేతన్ వారిచే కూచిపూడి నృత్య ప్రదర్శన కడురమ్యంగా నిర్వహించారు.దేవస్థాన సంఘం మహిళా విభాగం సభ్యులు పాల్గొని భక్తులకు అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకున్నారు.బుదవారం నాడు అమ్మవారిని పద్మావతిదేవి రూపంలో అలంకరణ ఉంటుందని ఉత్సవ కమిటీ సభ్యులు తెలియజేశారు.
Authored by: Vaddadi udayakumar