- పోలీసులు రాగానే దుండగులు పరార్
- సిబ్బందిపై దుండగులు తుపాకీతో కాల్పులు డిప్యూటీ మేనేజర్ గాయాలు
హైదరాబాద్,ఐఏషియ న్యూస్: భాగ్యనగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది.హైదరాబాద్ నగరం చందానగర్‌లో మంగళవారం పట్టపగలే దొంగలు బీభత్సం సృష్టించారు. ఖజానా జ్యువెలరీ దుకాణంలో దుండగులు బంగారు ఆభరణాలు దోపిడీకి యత్నించారు. సిబ్బంది వారిని ప్రతిఘటించడంతో వారిపై తుపాకీతో కాల్పులు జరిపారు. దీంతో షోరూమ్ కు చెందిన ఓ వ్యక్తి తీవ్రంగాగాయపడ్డారు. వివరాల్లోకి వెళితేమంగళవారం ఉదయం చందానగర్‌లోని ఖజానా జ్యువెలరీ దుకాణం 11 గంటలకు తెరవడం జరిగింది. ఐదు నిమిషాల్లోనే ఆరుగురు దుండగులు మాస్కులు ధరించి షోరూమ్ లోకి ప్రవేశించారు. వెంటనే వారంతా లాకర్ తాళంచెవి ఇవ్వాలని తుపాకీతో సిబ్బందిని బెదిరించారు. దీనికి సిబ్బంది నిరాకరించడంతో తమ వెంట తెచ్చుకుని తుపాకులతో కాల్పులు జరిపారు. దీంతో డిప్యూటీ మేనేజర్ కాలికి గాయాలయ్యాయి. లోపల బంగారు ఆభరణాలకు సంబంధించిన స్టాల్స్ విరగ్గొట్టి సిబ్బందిపై దాడులకు సైతం పాల్పడ్డారు. భయాందోళనలకు గురైన సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసుల హుటాహుటిన షోరూం దగ్గరకు చేరుకున్నారు. పోలీసులను చూసిన దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు. నిందితుల కోసం పది బృందాలను ఏర్పాటు చేశారు. ఈ దోపిడీలో పాల్గొనేందుకుమొత్తం ఎంత మంది వచ్చారనే విషయమై స్థానికంగా ఉన్న ట్రాఫిక్ సీసీ కెమెరాలను,ఇతర షోరూమ్‌ల వద్ద ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.కాగా, ఘటనా స్థలాన్ని సైబరాబాద్ సీపీ అవినాశ్ మహంతి పరిశీలించారు. కాల్పుల ఘటనపై సిబ్బందినిఅడిగితెలుసుకున్నారు.దుండగులను పట్టుకోవడానికి వెంటనే పది ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Authored by: Vaddadi udayakumar