- పట్టణ పురవీధుల్లో ముమ్మారు ఊరేగిన పైడితల్లమ్మ
- పకడ్బందీ ఏర్పాట్లతో ప్రశాంతంగా ముగిసిన జాతర
విజయనగరం,ఐఏషియ న్యూస్: ఉత్తరాంధ్ర కల్పవల్లి, విజయనగరం ఇలవేల్పు శ్రీ పైడితల్లి అమ్మవారి సిరిమాను సంబరం అంగరంగ వైభవంగా జరిగింది. లక్షలాది జనం జేజేలు పలుకుతుండగా, బెస్తవారి వల, అంజలి రథం, పాలధార, తెల్ల ఏనుగు ముందు నడవగా అమ్మవారు సిరిమాను రూపంలో మూడుసార్లు కోట వద్దకు వెళ్లి రాజ కుటుంబాన్ని, ఆశేష భక్త జనావళిని ఆశీర్వదించారు. ఈ వేడుకను భక్తజనం కనులారా తిలకించి పులకించారు. సంప్రదాయబద్దంగా సిరిమాను పూజారి బంటుపల్లి వెంకటరావు సిరిమానును అధిరోహించి భక్త జనాన్ని ఆశీర్వదించారు. అధికార యంత్రాంగం తీసుకున్న పటిష్ట చర్యల కారణంగా సిరిమానోత్సవం ప్రశాంతంగా పూర్తయింది.మంగళవారం మధ్యాహ్నం సుమారు 4.15 గంటలకు సిరిమానోత్సవం ప్రారంభమయ్యింది.రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, పేదరిక నిర్మూలన, ఎన్నారై వ్యవహారాల శాఖా మంత్రి కొండపల్లి శ్రీనివాస్,జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి, ఎస్పీ ఏఆర్ దామోదర్,ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు,జాయింట్ కలెక్టర్ ఎస్. సేధు మాధవన్ పర్యవేక్షించారు. వర్షం కారణంగా నిర్ణీత సమయం కంటే కొంత ఆలస్యంగా సిరిమాను నడక ప్రారంభమయ్యింది. భక్తులు పెద్ద సంఖ్యలో అమ్మవారికి జయజయ ధ్వానాలు పలుకుతుండగా, మూడుసార్లు అమ్మవారు సిరిమానుపై ఊరేగారు. సుమారు 5.45 గంటలకు ఉత్సవం ముగిసింది.ఈ కార్యక్రమాన్ని పూసపాటి వంశీయులు, మాన్సాస్ చైర్మెన్, గోవా గవర్నర్ శ్రీ పూసపాటి అశోక్ గజపతిరాజు, రాజ కుటుంబీకులు కోట బురుజుపైనుంచి తిలకించారు. వీరితో పాటు జిల్లా ఇంచార్జి మంత్రి వంగలపూడి అనిత, జిల్లా మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్యే అదితి విజయలక్ష్మి గజపతిరాజు, బొబ్బిలి ఎమ్మెల్యే బేబీ నాయన, మార్క్ఫెడ్ చైర్మన్ కర్రోతు బంగారురాజు, పలువురు ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు కోటపై నుంచే తిలకించారు.
Authored by: Vaddadi udayakumar