విజయవాడ,ఐఏషియ న్యూస్: తెలుగు రాష్ట్రాలకు కేంద్రం వరాలను ప్రకటిస్తూనే ఉంది. రెండు తెలుగురాష్ట్రాల మధ్య రహదారుల విస్తరణపైన దృష్టి సారించిన కేంద్రం జాతీయ రహదారులను, గ్రీన్ ఫీల్డ్ హైవేలను అందిస్తూ రవాణా సదుపాయాలను మెరుగుపరచడంతో పాటు, పారిశ్రామిక ప్రగతికి దోహదం చేస్తుంది. ఇక రెండు తెలుగురాష్ట్రాల మధ్య ప్రయాణాన్ని మరింత సులువు చేయాలని భావించిన కేంద్రం హైదరాబాద్, విజయవాడ జాతీయ రహదారి ఎన్ హెచ్ 65 విస్తరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఆరు వరుసలుగా ఎన్హెచ్ 65 విస్తరణ
ప్రస్తుతం నాలుగు వరుసలుగా ఉన్న ఈ జాతీయ రహదారిని ఆరు వరుసలుగా విస్తరించడానికి రెడీ అయింది. నేషనల్ హైవే పైన రోడ్డు ప్రమాదాల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ఈ ఆరు లైన్ల హైవే విస్తరణను వేగవంతం చేయాలని నిర్ణయించింది. ఇక ఈ ప్రాజెక్టు కోసం కేంద్రం ఆమోదం తెలిపింది. దీంతో త్వరలోనే ఈ ప్రాజెక్టు విస్తరణకు టెండర్లు పిలవనున్నారు.
దండు మల్కాపూర్ నుండి గొల్లపూడి వరకు ఎన్ హెచ్ 65 విస్తరణ
తెలంగాణ రాష్ట్రంలోని దండు మల్కాపూర్ నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గొల్లపూడి వరకు 265 కిలోమీటర్ల పొడవున ఎన్ హెచ్ 65 ను విస్తరించనున్నారు. దీనికోసం 6,250 కోట్ల రూపాయలను ఖర్చు చేయనున్నారు. ఈ రోడ్డు విస్తరణతో పాటు సర్వీస్ రోడ్లను కూడా నిర్మిస్తారు.దీనికి సంబంధించిన డి పి ఆర్ ను నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా కేంద్రానికి పంపింది. నాలుగు లైన్ల నుండి ఆరు లైన్ల విస్తరణకు ఈనెల 15వ తేదీన ఫైనాన్స్ కమిటీ సమావేశంలో ఆమోదం తెలపనుంది.
టెండర్ లు అప్పుడే
ఇక ఈ మేరకు ఈ నెలలోనే టెండర్లు పిలిచే అవకాశాలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. సెప్టెంబర్ చివరిలో లేదా అక్టోబర్ మాసంలో పనులను ప్రారంభించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ హైవేలో తరచూ జరుగుతున్న ప్రమాదాలను దృష్టిలో పెట్టుకొని ఈ రహదారి విస్తరణ చేయాలని భావిస్తున్నారు.
ఈ నేషనల్ హైవే పై వరుస ప్రమాదాలు
ఈ సంవత్సరం జనవరి నుండి ఇప్పటివరకు ఈ రహదారిలో 569 రోడ్డు ప్రమాదాలు జరగగా 56 మంది మృతి చెందారు. ఇటీవల ఏపీకి చెందిన ఇద్దరు డిఎస్పీలు కూడా మృతి చెందారు. ఈ జాతీయ రహదారి విస్తరణ కోసం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కేంద్రాన్ని విజ్ఞప్తి చేస్తున్నారు.
15వ తేదీన ఈ ప్రాజెక్టుకు ఆమోదం
ఇటీవల ఢిల్లీ పర్యటనలో కూడా మంత్రి వెంకట్ రెడ్డి కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని కలిసి విజ్ఞప్తి చేయగా ఆయన సానుకూలంగా స్పందించారు. ఈ క్రమంలో ఈనెల 15వ తేదీన జరిగే ఫైనాన్స్ కమిటీ సమావేశంలో ఈ ప్రాజెక్టుకు ఆమోదం తెలుపుతామని హామీ ఇచ్చారు. ఏపీ సీఎం చంద్రబాబు కూడా ఈ ప్రాజెక్టును గొల్లపూడి వరకు విస్తరించాలని కేంద్రాన్ని కోరారు దీనికి కేంద్రఆమోదం తెలుపగా త్వరలోనే దీనికి టెండర్లను పిలిచే అవకాశం ఉంది.
ఫ్యూచర్ సిటీ నుండి అమరావతి వరకు హైవే నిర్మాణం
ఇక ఈ హైవే ని హైదరాబాద్లోని ఫ్యూచర్ సిటీ నుండి ఆంధ్రప్రదేశ్లోని అమరావతి వరకు నిర్మించనున్నారు. ప్రస్తుతం ఉన్న 270 కిలోమీటర్ల రహదారితో పోలిస్తే ఈ కొత్త హైవే ద్వారా దాదాపు 70 కిలోమీటర్ల దూరం తగ్గుతుంది.దీనివల్ల రెండు గంటల్లోనే హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్లే అవకాశం ఉంటుంది.
Authored by: Vaddadi udayakumar