- స్త్రీ శక్తి పధకం ఎప్పుడెప్పుడా అని మీడియా, ప్రతిపక్షాలు ఎదురు చూసారు
- సినిమా సక్సెస్ మీట్ లాగా స్త్రీ శక్తి సక్సెస్ మీట్ పెట్టడం సంతోషం
- స్త్రీ శక్తి పథకం విజయవంతం:మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి
విజయవాడ,ఐఏషియ న్యూస్: స్త్రీ శక్తి పథకం రాష్ట్రవ్యాప్తంగా విజయవంతంగా అమలవుతుండటంపై రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆర్టీసీ హౌస్ లో ఏర్పాటు చేసిన పత్రిక సమావేశంలో మీడియాతో మాట్లాడారు.స్త్రీ శక్తి పథకం ఎప్పుడొస్తుందా అని మీడియా, ప్రతిపక్షాలు ఎదురు చూశాయి. ఇప్పుడు సినిమా సక్సెస్ మీట్ లాగా, స్త్రీ శక్తి సక్సెస్ మీట్ నిర్వహించడం నాకు ఎంతో ఆనందంగా ఉందని ఆయన అన్నారు.మంత్రి మాట్లాడుతూ, రాష్ట్రంలో అమలవుతున్న సూపర్ సిక్స్ పథకాలలో ఒకదాన్ని మించి ఒకటి ప్రజల ఆదరణ పొందుతున్నాయని తెలిపారు. వాటిలో ఎక్కువ మంది లబ్ధిదారులు ఉన్న పథకం స్త్రీ శక్తి అని, దీని ద్వారా రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది మహిళలు లబ్ధి పొందుతున్నారని పేర్కొన్నారు.
ఎలాంటి సమస్యలు లేకుండా అమలు
స్త్రీ శక్తి పథకం ప్రారంభించి ఆరవ రోజుకే సుమారు 65 లక్షల మంది మహిళలు ఉచిత బస్సు ప్రయాణం చేసారని మంత్రి తెలిపారు. ఇప్పటివరకు సుమారు 25 కోట్లు ఖర్చయిందని,ఆ మొత్తాన్ని ఏపీఎస్ఆర్టీసీకి చెల్లిస్తున్నామని వివరించారు.ఘాట్ రోడ్ల విషయంలో మొదట్లో వచ్చిన కొన్ని విమర్శలను గంటల్లోనే పరిష్కరించామని చెప్పారు. ప్రతిపక్షాల్లో ఉన్న మాజీ ఎమ్మెల్యేలు కూడా స్త్రీ శక్తి పథకం అమలును కొనియాడటం రాష్ట్ర ప్రభుత్వానికి గర్వకారణమని తెలిపారు.
భవిష్యత్ ప్రణాళికలు
త్వరలోనే 750 ఎలక్ట్రిక్ ఏసీ బస్సులు రానున్నాయని, రాబోయే 4 ఏళ్లలో 2,500 ఎలక్ట్రిక్ బస్సులు ప్రవేశపెట్టనున్నామని తెలిపారు. వచ్చే 2 ఏళ్లలో పల్లె వెలుగు బస్సులలో కూడా ఏసీ సౌకర్యం కల్పించనున్నామని ప్రకటించారు.రాష్ట్ర బోర్డర్ ప్రాంతాల్లో ఉన్న సమస్యలను వారం రోజుల్లో పరిష్కరిస్తామని మంత్రి మండిపల్లి తెలిపారు.
మహిళలకు ప్రత్యేక గుర్తింపు
కండక్టర్ల కొరత అంశం తమ దృష్టికి వచ్చిందని, తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. పురుషులు ఇబ్బందులు పడుతున్నారనే అంశంపై ఇప్పటివరకు ఎలాంటి ఫిర్యాదులు రాలేదని స్పష్టం చేశారు. భవిష్యత్తులో మహిళలకు ప్రత్యేక గుర్తింపు కోసం స్మార్ట్ కార్డ్ జారీ చేసే ఆలోచన ఉందని మంత్రి ప్రకటించారు.
పెట్టుబడులపై స్పష్టత
పెట్టుబడిదారులను రాష్ట్రానికి ఆకర్షించడంలో భాగంగా మాత్రమే భూములను కేటాయిస్తున్నామని, ఆ భూములు పూర్తిగా ఏపీఎస్ఆర్టీసీ ఆధీనంలో ఉన్నవే అని స్పష్టం చేశారు.
మా పూర్వజన్మ సుకృతం
ఈ పథకం అమలు చేయగలగడం మా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాం. స్త్రీ శక్తి భారం కాదు, ఇది రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత. మహిళల ఆశీస్సుల వలననే చంద్రబాబు నాలుగోసారి ముఖ్యమంత్రిగా అయ్యారు. మహిళల కోసం ఈ పథకాన్ని ప్రారంభించడం గర్వకారణం అన్నారు.ఈ సమావేశంలో ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణ,ఎండీ ద్వారక తిరుమల రావు,ఆర్టీసీ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Authored by: Vaddadi udayakumar