హైదరాబాద్ ,ఐఏషియ న్యూస్: హెచ్ 1 బి వీసా విషయంలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ జారీ చేసిన కార్యనిర్వాహక ఉత్తర్వులపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ట్రంప్ తాజా నిర్ణయం అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్న భారతీయులపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు.ట్రంప్ జారీ చేసిన ఉత్తర్వులు తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని, భారత్ – అమెరికా దేశాల మధ్య సంబంధాల చరిత్రలో ఇలాంటి చర్యలు ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని పేర్కొన్నారు.అమెరికా ఆర్థిక వ్యవస్థకు దశాబ్దాలుగా తోడ్పడుతున్న భారతీయ టెక్ నిపుణులు,ఇతర నైపుణ్యం కలిగిన కార్మికుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని,ఈ సమస్యను పరిష్కరించడానికి భారత ప్రభుత్వం వెంటనే ఒక పరిష్కార మార్గాన్ని అన్వేషించాలని ముఖ్యమంత్రి రేవంత్ అన్నారు.
అమెరికా ప్రభుత్వ ఉత్తర్వుల వల్ల తెలుగు టెక్ నిపుణులపై తీవ్ర ప్రభావం పడుతుందని ముఖ్యమంత్రి రేవంత్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమస్యను త్వరగా పరిష్కరించకపోతే, భారతీయ నిపుణులు ఊహించని కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుందని పేర్కొన్నారు.ఈ విషయంలో జోక్యం చేసుకుని, సమస్యను యుద్ధ ప్రాతిపదికన పరిష్కరించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్. జైశంకర్ లకు ముఖ్యమంత్రి రేవంత్ విజ్ఞప్తి చేశారు.నైపుణ్యం కలిగిన భారతీయ కార్మికుల ఉద్యోగ, వలస అవకాశాలపై అమెరికా కార్యనిర్వాహక ఉత్తర్వుల ప్రభావం పడుతుందనే ఆందోళన భారత టెక్ పరిశ్రమలో పెరుగుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ మేరకు ‘ఎక్స్’ వేదికగా స్పందించారు.
Authored by: Vaddadi udayakumar