మట్టిలో దాగున్న బంగారు నిధి..మన దేశంలోని 5 పెద్ద బంగారు గనులివే

స్పెషల్ డెస్క్,ఐఏషియ న్యూస్:  మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో భారీగా బంగారు నిక్షేపాలు ఉన్నట్లు ఇటీవల జరిపిన సర్వేలో వెల్లడైంది. భూగర్భ శాస్త్రవేత్తలు చాలా ఏళ్లుగా కష్టపడి చేసిన పరిశోధనల తర్వాత ఈ అరుదైన విషయాన్ని ధృవీకరించారు.ఈ కొత్త ఆవిష్కరణ మధ్యప్రదేశ్ ఆర్థిక వ్యవస్థలో గొప్ప మార్పు తీసుకురావచ్చని భావిస్తున్నారు. అంతేకాదు, మన దేశంలో ఇంకా చాలా చోట్ల ఇలాంటి బంగారు నిధులున్నాయి.ఆ విశేషాలు, భారతదేశంలోని అతిపెద్ద ఐదు బంగారు గనుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
కర్ణాటకలోని హట్టి గోల్డ్ మైన్స్
హట్టి గోల్డ్ మైన్స్ భారతదేశంలోనే అత్యంత పురాతనమైన,అతిపెద్ద బంగారు గని. దీని చరిత్ర సుమారు 2,000 సంవత్సరాల నాటిది. పురాతన కాలం నుండి ఇక్కడ తవ్వకాలు జరుగుతున్నాయని ఆధారాలు ఉన్నాయి. ఈ గని ఇప్పటికీ చురుగ్గా పనిచేస్తోంది. ఇక్కడ ఏటా దాదాపు 1.8 టన్నుల బంగారం ఉత్పత్తి అవుతుంది.ఇది దేశంలోనే ప్రాథమిక బంగారం ఉత్పత్తి చేసే ఏకైక సంస్థగా కొనసాగుతోంది. భవిష్యత్తులో కూడా ఇక్కడ ఇంకా చాలా బంగారం నిక్షేపాలు ఉన్నాయని అంచనా.
కర్ణాటకలోని కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ (కేజీఎఫ్)
కేజీఎఫ్ గురించి తెలియని భారతీయులు ఉండరు. బ్రిటిష్ వారి హయాంలో 1880లో ఇక్కడ తవ్వకాలు ప్రారంభమయ్యాయి. 2001లో గని మూతపడే నాటికి దాదాపు 800 టన్నుల బంగారం ఇక్కడ నుంచి వెలికితీశారు. తక్కువ గ్రేడ్‌ గని కావడంతో, బంగారం తవ్వకం ఖర్చు ఎక్కువైంది.దీంతో గనిని మూసివేశారు.అయితే, ఇప్పుడు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం సాయంతో తిరిగి గనిని ప్రారంభించేందుకు భారత ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది. ఒకవేళ కేజీఎఫ్ తిరిగి ప్రారంభమైతే, దేశ ఆర్థిక వ్యవస్థకు ఇది చాలా ఉపయోగపడుతుంది.
ఉత్తరప్రదేశ్‌లోని సోన్‌భద్ర
2020లో సోన్‌భద్ర జిల్లాలో 3,000 టన్నుల బంగారు నిక్షేపాలు ఉన్నాయన్న వార్త కలకలం రేపింది. అయితే, తర్వాత జరిపిన పరిశోధనల్లో ఆ వార్తలో నిజం లేదని తేలింది. భూగర్భ శాస్త్రవేత్తలు ఈ ప్రాంతంలో కేవలం 160 కిలోల బంగారం మాత్రమే లభించిందని స్పష్టం చేశారు.అయినప్పటికీ, సోన్‌భద్ర ప్రాంతంలో బంగారం,ఇతర ఖనిజ సంపదకు సంబంధించిన నిక్షేపాలు ఇంకా ఉన్నాయని పరిశోధకులు భావిస్తున్నారు.భవిష్యత్తులో ఈ ప్రాంతం యూపీకి ‘గోల్డ్ హబ్’గా మారే అవకాశం ఉంది.
ఆంధ్రప్రదేశ్‌లోని రామగిరి గోల్డ్ ఫీల్డ్
ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాలో ఉన్న రామగిరి గోల్డ్ ఫీల్డ్ చారిత్రాత్మకంగా చాలా ముఖ్యమైనది. గతంలో బ్రిటిష్ వారు ఇక్కడ విస్తృతంగా తవ్వకాలు జరిపారు. 1910 నుంచి 1927 మధ్యలో దాదాపు 176,338 ఔన్సుల బంగారం వెలికితీశారు. తర్వాత భారత్ గోల్డ్ మైన్స్ లిమిటెడ్ కూడా ఇక్కడ తవ్వకాలు చేసింది. ఈ ప్రాంతంలో ఇంకా బంగారం నిక్షేపాలు ఉన్నాయని, భవిష్యత్తులో మైనింగ్ కార్యకలాపాలు ఇక్కడ తిరిగి పుంజుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లోని చిగురుకుంట
ఇది చిత్తూరు జిల్లాలో ఉన్న ఒక ముఖ్యమైన ప్రాంతం. 2018లో జరిపిన వేలంలో నేషనల్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఈ గనిని దక్కించుకుంది. 263 హెక్టార్లలో విస్తరించిన ఈ గనిలో 1.83 మిలియన్ టన్నుల బంగారు ఖనిజం ఉందని అంచనా. ఇందులోంచి సుమారు 8.5 టన్నుల బంగారం ఉత్పత్తి చేయవచ్చని భావిస్తున్నారు. ఎన్ఎండిసి ఆధ్వర్యంలో ఇక్కడ తవ్వకాలు ప్రారంభించేందుకు ప్రణాళికలు జరుగుతున్నాయి.

Authored by: Vaddadi udayakumar

About admin

Check Also

ప్రజాస్వామ్యంలో హింస పని చేయదు,జెండా కర్రే ఆయుధం

జనసేనాని,డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పిలుపు విశాఖపట్నం,ఐఏషియ బ్యూరో: ప్రజాస్వామ్యంలో హింస పనిచేయదని,జెండా కర్రే ఆయుధం, గుండెల నుంచి వచ్చే …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *