శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు భక్తుల రవాణా భద్రతపై ఎస్పీ సుబ్బారాయుడు సమావేశం

తిరుమల,ఐఏషియ న్యూస్: శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ముహూర్తం సమీపిస్తోంది. ఈనెల 24 నుంచి అక్టోబర్ 2 వరకు తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అత్యంత ఘనంగా జరగనున్నాయి. ఈ నేపథ్యంలో టీటీడీ ఏఈవో వెంకయ్య చౌదరి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. తిరుమలలోని అన్నమయ్య భవన్‌లో తిరుపతి ఎస్పీ సుబ్బరాయుడుతో కలిసి టీటీడీ విజిలెన్స్, పోలీసులతో సమావేశం నిర్వహించారు.ఇందులో బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తుల భద్రత, రవాణా, పార్కింగ్ సదుపాయాలు, క్రౌడ్ మేనేజ్‌మెంట్ వంటి అంశాలపై చర్చించారు. బ్రహ్మోత్సవాలకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చేందుకు అవకాశం ఉన్న నేపథ్యంలో భక్తుల సౌకర్యం కోసం ఆర్టీసీ ద్వారా రోజూ 435 బస్సులు నడపాలని నిర్ణయించారు.
బ్రహ్మోత్సవాల కోసం 435 బస్సులను ఏర్పాటు చేయడం ద్వారా రోజూ సుమారు 1.60 లక్షల మంది శ్రీవారి భక్తులకు పికప్,డ్రాప్ సౌకర్యం కల్పించవచ్చని భావిస్తున్నారు. మరోవైపు బ్రహ్మోత్సవాల కోసం భక్తులు ప్రైవేట్ వాహనాలు, సొంత వాహనాలలోనూ వస్తుంటారు. ఈ నేపథ్యంలో పార్కింగ్ కోసం తిరుపతిలో 23 ప్రదేశాలను టీటీడీ సిద్ధం చేస్తోంది.అలాగే వాహన సేవల సమయంలో మాడ వీధుల్లోని గ్యాలరీల నుంచి భక్తులు మలయప్పస్వామిని దర్శించుకుంటూ ఉంటారు. ఈ నేపథ్యంలో గ్యాలరీలలో1.85 లక్షల నుంచి 2 లక్షలమంది భక్తులు కూర్చునేలా ఏర్పాట్లు చేశారు.భక్తులకు అసౌకర్యం కలగకుండా వాహన సేవలను చూసేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల కోసం 4,200 మంది పోలీసులు కేటాయించినట్లు టీటీడీ తెలిపింది.అలాగే 1500 మంది విజిలెన్స్ సిబ్బందితో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు టీటీడీ ఏఈవో వెంకయ్య చౌదరి వివరించారు. కమాండ్ కంట్రోల్ సిస్టమ్ ద్వారా భక్తుల రాకపోకలు గుర్తిస్తామని అన్నారు.అలాగే రద్దీ పాయింట్లను రియల్ టైమ్ మానిటరింగ్ చేసేందుకు చర్యలు చేపట్టినట్లు వివరించారు. సీఎం చంద్రబాబు సహా ఇతర వీఐపీల రాకపోకలకు ప్రత్యేక ఎంట్రీ, ఎగ్జిట్ ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. మరోవైపు తిరుమల గురించి సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేస్తున్నట్లు టీటీడీ ఏఈవో తెలిపారు. బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులు సురక్షితమైన ప్రజా రవాణా సేవలను వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు.

Authored by: Vaddadi udayakumar

About admin

Check Also

అమెరికాలో మాజీ మంత్రి అంబటి రాంబాబు కుమార్తె ప్రేమ వివాహం

వివాహానికి హాజరైన అంబటి రాంబాబు దంపతులు ఇల్లినాయిస్‌(యుఎస్),ఐఏషియ న్యూస్:  మాజీ మంత్రి అంబటి రాంబాబు కుమార్తె శ్రీజ ప్రేమ పెళ్లి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *