హైదరాబాద్,ఐఏషియ న్యూస్ బ్యూరో: హైదరాబాద్ నగర వ్యాప్తంగా గణేశ్ నిమజ్జనాలు శనివారం ఉత్సాహభరితంగా, శాంతియుత వాతావరణంలో కొనసాగుతున్నాయి. చిన్నపిల్లల నుండి పెద్దల వరకు అందరూ వినాయకుడి శోభాయాత్రలో పాల్గొని పండుగను జరుపుకుంటున్నారు. నిమజ్జన వేడుకల నేపధ్యంలో డీజేలు, డప్పులు, బ్యాండ్లు, కోలాటాలు, సాంస్కృతిక ప్రదర్శనలతో నగరమంతా మరింత ప్రత్యేకంగా మారింది.
పోలీసుల డ్యాన్స్..
ఈ నిమజ్జన శోభాయాత్రలో ఆసక్తికర దృశ్యం చోటు చేసుకుంది. డీజే పాటల బాణీలకు పోలీసు సిబ్బంది కూడా భక్తులతో కలిసి స్టెప్పులు వేశారు. ముఖ్యంగా ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్రలో ఏసీపీ సంజయ్ చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. ఆయనతో పాటు పలువురు పోలీసులు కూడా భక్తులతో కలిసి ఆనందంగా డ్యాన్స్ చేయడం చూసి ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. రక్షక భటులు విధులు నిర్వర్తించడమే కాకుండా ఉత్సవాల్లో భాగమై ప్రజలతో కలసి పండగను జరుపుకోవడం విశేషంగా నిలిచింది.అలానే నిమజ్జనాల సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా భద్రతా ఏర్పాట్లు చేపట్టినట్లు తెలంగాణ డీజీపీ జితేందర్ తెలిపారు.ఎక్కడైతే భద్రత అవసరమో అక్కడ తగిన పోలీసు బందోబస్తు కేటాయించాం” అని ఆయన స్పష్టం చేశారు.
అకస్మాత్తుగా కనిపించిన సీఎం రేవంత్ రెడ్డి
నిమజ్జన వేడుకల మధ్య మరో కీలక సంఘటన చోటుచేసుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎలాంటి ప్రత్యేక వాహనాలు, బలమైన కాన్వాయ్ లేకుండా సాధాసీదాగా హుస్సేన్ సాగర్ వద్ద నిమజ్జన ప్రక్రియను పరిశీలించారు. అకస్మాత్తుగా సీఎంని చూసిన భక్తులు ఆయన చుట్టూ చేరి ఆత్మీయంగా మాట్లాడారు. సాధారణ భక్తుడిలా కార్యక్రమాన్ని పరిశీలిస్తూ, ప్రజలతో మమేకమైన ఆయన దృశ్యాలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి.
కాగా పలు ఏరియాల నుంచి గణనాథుడి విగ్రహాలు హుస్సేన్ సాగర్ వైపు తరలివస్తుండటంతో ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలు భక్తులతో కిక్కిరిశాయి. నిమజ్జన కార్యక్రమంలో భాగంగా ఎన్టీఆర్ మార్గ్ వద్ద ఏర్పాటు చేసిన క్రేన్ నెంబర్ 4 ద్వారా 69 అడుగుల ఎత్తైన ఖైరతాబాద్ మహా గణపతిని హుస్సేన్ సాగర్‌లో నిమజ్జనం చేశారు.ఈ సందర్భంగా వేలాది మంది భక్తులు అక్కడికి తరలివచ్చి మహాగణపతిని తిలకించారు. ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘంలో జరగకుండా పోలీస్ యంత్రాంగం అప్రమత్తంగా వ్యవహరించారు.ఏపీ నుంచి హైదరాబాద్ తరలివెళ్లిన భక్త జనం
వినాయక విగ్రహాల నిమజ్జనాన్ని కళ్లారా వీక్షించడానికి తెలంగాణతో పాటు పొరుగునే ఉన్న ఏపీ నుంచీ పెద్ద సంఖ్యలో ప్రజలు హైదరాబాద్ కు చేరుకున్నారు. ట్యాంక్ బండ్ పరిసరాల్లో అయిదు నుంచి ఆరు లక్షల మందికి పైగా భక్తులు చేరుకున్నట్లు అంచనా. లక్షలాది మందితో ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్, తెలుగుతల్లి ప్లైఓవర్, సెక్రటరీయేట్, లుంబినీ పార్క్ పరిసర ప్రాంతాలు ప్రజలతో కిటకిటలాడాయి.
Authored by: Vaddadi udayakumar