మాడుగుల ఎమ్మెల్యే బండారు ప్రశ్నకు స్పందించిన గిరిజన శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి
అమరావతి,ఐఏషియ న్యూస్: రాష్ట్రం గిరిజన జనాభా 50శాతం కంటే ఎక్కువగా ఉన్న ప్రాంతాలను షెడ్యూల్డ్ ఏరియాలుగా ప్రకటించేందుకు 496 గ్రామాలపై ప్రతిపాదన సిద్ధమై పరిశీలనలో ఉందని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి తెలిపారు. రాష్ట్రంలో గిరిజన సంక్షేమం కోసం ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటోందని పేర్కొన్నారు. శాసనసభలో మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి అడిగిన ప్రశ్నకు గిరిజన సంక్షేమ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి స్పందించారు.అనకాపల్లి జిల్లా మాడుగుల నియోజకవర్గంలోని కొన్ని గ్రామాలను షెడ్యూల్డ్ ఏరియాలో చేర్చే అంశంపై జిల్లా కలెక్టర్‌ను నివేదిక ఇవ్వమని కోరినట్లు వెల్లడించారు.తొమ్మిది గ్రామపంచాయతీలకు చెందిన 60 గ్రామాలలో 25,000 పైగా గిరిజన జనాభా ఉన్నట్టు గుర్తించామని చెప్పారు.గిరిజన సంక్షేమానికి రూ. 8,159 కోట్లు కేటాయించడంతో పాటు, “అడవి తల్లి బాట” పథకం కింద రూ. 1,005 కోట్లతో 1,069 కి.మీ. రహదారులు నిర్మాణం,బిఎస్ఎన్ఎల్ టవర్ల కోసం రూ. 3.45 కోట్ల వ్యయం,”బాబు జగ్జీవన్ రామ్” పథకం కింద ప్రతి కుటుంబానికి నెలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందజేత జరుగుతోందని మంత్రి తెలియజేశారు.గిరిజనుల విద్య, ఆరోగ్యం, ఉపాధి, రవాణా మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని, భవిష్యత్తులో మరిన్ని పథకాలను అమలు చేస్తామని మంత్రి సంధ్యారాణి వివరించారు.
Authored by: Vaddadi udayakumar