హైదరాబాద్,ఐఏషియ న్యూస్: తెలంగాణ అభివృద్ధి కోసం ఎవరినైనా కలుస్తా. ఎవరితోనైనా కొట్లాడుతా.. ఢిల్లీనైనా ఢీ కొడుతా నిధులు తీసుకొస్తా. అడగడానికి కూడా వెనుకాడను. రాకపోతే కొట్లాడటానికి అసలే భయపడను. రాష్ట్రానికి కావలసిన నిధులు, రావలసిన అనుమతుల కోసం ప్రధానమంత్రి, కేంద్ర మంత్రుల వద్దకు వెళ్లి అడగడం ముఖ్యమంత్రిగా నా బాధ్యత. ఒకటికి వందసార్లు తిరుగుతా. నాకు ఓపిక ఉంది. వయసుంది. విషయాన్ని వివరించే కనీస పరిజ్ఞానం నాకుంది.మీ ఆశీర్వాదం ఇలాగే ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలను ఉద్దేశించి అన్నారు. కాకతీయ కాలం నుంచి ప్రపంచానికి పోరాట పంథాను చాటిచెప్పిన వరంగల్ గడ్డ, సమ్మక్క,సారలమ్మ, చాకలి ఐలమ్మ, దొడ్డి కొమురయ్య, కృష్ణమాచార్యులు, కాళోజీ నారాయణ రావు, పీవీ నర్సింహరావు నుంచి తెలంగాణ మలిదశ ఉద్యమానికి నాయకత్వం వహించిన ప్రొ. జయశంకర్ ప్రజాప్రభుత్వానికి స్ఫూర్తిగా నిలుస్తారు. వారి స్ఫూర్తిగానే ప్రభుత్వం పనిచేస్తోందని చెప్పారు.
ప్రజాపాలన – ప్రజా విజయోత్సవాలు కార్యక్రమాల్లో భాగంగా వరంగల్ జిల్లా నర్సంపేటలో రూ. 532.24 కోట్లతో చేపట్టనున్న పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన అనంతరం బహిరంగ సభలో ముఖ్యమంత్రి మాట్లాడారు.నిరుపేదలు, దళిత, గిరిజన,ఆదివాసీ, మైనారిటీ పిల్లలు చదువుకుంటేనే భవిష్యత్తు ఉంటుంది. అవసరమైన సౌకర్యాలు కల్పించి నాణ్యమైన చదువులు అందించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది. తాతముత్తాల కాలం పది తరాలుగా వృత్తులు చేసుకుంటూ వచ్చినా బతుకులు మారలేదు. చదువొక్కటే మన బతుకుల్లో మార్పు తీసుకొస్తుంది. నిలబెడుతుంది. ప్రపంచంతో పోటీ పడేలా చేస్తుంది. ప్రజాప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత అనేక సామాజిక అంశాలను పరిగణలోకి తీసుకుని ఒకవైపు రైతులు, మరోవైపు మహిళలు, ఇంకోవైపు యువత కోసం కార్యక్రమాలు చేపట్టింది. యువత కోసం ఉద్యోగ నియామకాలు చేపట్టాం. అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాది లోపే 61 వేల ఉద్యోగాలిచ్చాం. ఇంకా 40 వేల ఉద్యోగాలిచ్చే ప్రక్రియ మొదలవుతుంది.అభివృద్ధి పథంలో సాగాలంటే ఎడ్యుకేషన్, ఇరిగేషన్, కమ్యునికేషన్ అత్యంత కీలకమని, ఆయా రంగాల్లో లక్ష్యాలను సాధించడానికి ఈ నెల 8, 9, తేదీల్లో ప్రపంచ స్థాయిలో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ను నిర్వహిస్తున్నాం. హైదరాబాద్‌తో సమంగా వరంగల్‌ను అభివృద్ధి చేయాలి. పక్క రాష్ట్రాల్లో నాలుగైదు విమానాశ్రయాలుంటే, తెలంగాణలో ఒక్కటి మాత్రమే ఉంది. పదేండ్లలో వీటి గురించి పట్టించుకోలేదు. కనీసం రోడ్లు వేయలేదు. ఈనెలఖరు నాటికి భూ సేకరణ పూర్తి చేసి మార్చి 31 లోపు వరంగల్ విమానాశ్రయ పనులు ప్రారంభిస్తాం.హైదరాబాద్ తరహాలోనే వరంగల్‌కు ఔటర్ రింగ్ రోడ్డు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, ఎయిర్ పోర్టు పూర్తి చేస్తాం. వందల సంవత్సరాల చరిత్ర కలిగిన సమ్మక్క – సారలమ్మ మందిరం అద్భుతంగా నిర్మాణవుతోందని, అదే తరహాలో వరంగల్‌ను అభివృద్ధి చేస్తాం. తాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తాం. రాష్ట్రంలో ప్రతి మారుమూల తండాకు రోడ్డు కనెక్టివిటీ ఉండాలన్న లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని,రాష్ట్రంలో ఏ గ్రామానికీ రోడ్డు లేదన్న మాట వినదలచుకోలేదన్నారు.రోడ్లు, భవనాల శాఖ, పంచాయతీ రాజ్ శాఖ ఆధ్వర్యంలో 20 వేల కోట్లు వెచ్చించి రోడ్లు నిర్మిస్తున్నాం. ప్రతి గూడెం నుంచి మండల కేంద్రానికి, ప్రతి మండల కేంద్రం నుంచి జిల్లా కేంద్రానికి రెండు వరుసలు, జిల్లా కేంద్రం నుంచి రాజధానికి నాలుగు వరుసల రోడ్లు వేస్తున్నాం.రాష్ట్రంలో కోటిమంది మహిళలను కోటీశ్వరులను చేయాలన్న సంకల్పంతో మహిళాభ్యున్నతి కోసంఅనేకకార్యక్రమాలు చేపట్టాం. ఉచిత బస్సు సౌకర్యం, సంఘాలకు వడ్డీ లేని రుణాలు, సోలార్ విద్యుత్ ప్లాంట్లు, పెట్రోల్ బంకులు, ఉత్పత్తుల విక్రయానికి శిల్పారామంలో ఇందిరా మహిళా శక్తి బజార్, బస్సులకు యజమానులుగా. ఇలా అనేక పథకాలు అమలు చేస్తున్నాం.ఇంటి ఆడబిడ్డకు చీరె పెట్టడం ఒక సంప్రదాయం. ఇంట్లో సొంత సోదరుడి తరహాలో ప్రతి ఏటా సారె పండుగ చేసుకోవాలని గ్రామీణ ప్రాంతాల్లో 65 లక్షల మంది ఆడబిడ్డలకు చీర అందిస్తున్నాం. రాష్ట్రంలో 18 సంవత్సరాలు పైబడిన ప్రతి ఆడబిడ్డకు చీరె చేరాలి. రాష్ట్రంలో ఏ ఒక్క ఆడబిడ్డ కూడా నాకు చీర రాలేదని అనొద్దు. గ్రామీణ ప్రాంతాల్లో పూర్తయ్యాక, మార్చిలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా పట్టణ, మున్సిపాలిటీల్లో చీరె అందజేస్తాం. ప్రతి పేదవారికి సంక్షేమ పథకాలు అందాలన్న లక్ష్యంతో ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేస్తోంది. రాష్ట్రంలో 1.10 కోట్ల రేషన్ కార్డులు ఉండగా, 3.10 కోట్ల మంది బిడ్డలకు సన్నబియ్యం ఇస్తున్నాం. ప్రభుత్వంపై 13 వేల కోట్ల రూపాయల భారం అవుతున్నా పేదవారి ఆకలి తీర్చాలని, వారు కడుపునిండా భోజనం చేయాలని సన్నబియ్యం ఇస్తున్నాం. పేదవారి ఆత్మగౌరవం పెరగాలన్న లక్ష్యంతో వారికి ఇందిరమ్మ ఇండ్లు ఉండాలని, ఆర్థికంగా భారమైనప్పటికీ ప్రతి నియోజకవర్గానికి 3,500 చొప్పున ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేశాం. రాష్ట్ర వ్యాప్తంగా 4.50 లక్షల ఇందిరమ్మ ఇండ్ల పనులు మొదలయ్యాయని సంక్షేమ కార్యక్రమాల లక్ష్యాలను ముఖ్యమంత్రి వివరించారు.
Authored by: Vaddadi udayakumar
News Website (iasianews.net) I Asia News