16 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియా నిషేదించండి

కేంద్ర ప్రభుత్వానికి మద్రాస్ హైకోర్టు సూచన

చెన్నై,ఐఏషియ న్యూస్: సోషల్ మీడియా వినియోగం పిల్లల మానసిక స్థితిపై తీవ్ర ప్రభావం చూపుతున్న తరుణంలో మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఆస్ట్రేలియా తరహాలో మన దేశంలో కూడా 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించే చట్టం తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. ఇంటర్నెట్‌లో అశ్లీల కంటెంట్ పిల్లలకు సులభంగా అందుబాటులో ఉండటంపై ఆందోళన వ్యక్తం చేస్తూ దాఖలైన ఒక ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్)పై మద్రాస్ హైకోర్టు ధర్మాసనం ఇటీవల విచారణ చేపట్టింది. జస్టిస్ జి జయచంద్రన్ , జస్టిస్ కేకే రామకృష్ణన్‌లతో కూడిన ధర్మాసనం ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లకు (ఐఎస్‌పీ) పలు సూచనలు చేసింది.
ఆస్ట్రేలియా చట్టం ప్రస్తావన
ఇటీవల ఆస్ట్రేలియా ప్రభుత్వం 16 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియా వాడకుండా నిషేధిస్తూ చట్టం తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. అదే తరహాలో మన దేశంలో కూడా ఒక చట్టాన్ని రూపొందించే అవకాశాలను కేంద్ర ప్రభుత్వం పరిశీలించాలని మద్రాస్ హైకోర్టు బెంచ్ పేర్కొంది. ఆ కొత్త చట్టం తీసుకువచ్చే వరకు ఇప్పటివరకు ఉన్న చట్టాలను పకడ్బందీగా అమలు చేయాలని ఆదేశించింది.
కోర్టు వ్యక్తం చేసిన ప్రధాన అంశాలు
ఇంటర్నెట్ వాడే పిల్లలు పెడదోవ పట్టే అవకాశం ఉన్నందున.. వారిని పర్యవేక్షించాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఎక్కువగా ఉందని కోర్టు స్పష్టం చేసింది.ఫోన్లు,ట్యాబ్‌లు,కంప్యూటర్లు,ల్యాప్‌టాప్‌లలో పేరెంటల్ కంట్రోల్ యాప్స్ తప్పనిసరిగా ఇన్‌స్టాల్ చేయాలని సూచించింది.దీనిపై వినియోగదారులకు అవగాహన కల్పించాలని ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లను ఆదేశించింది.స్కూల్లో పిల్లలకు చైల్డ్ రైట్స్ (పిల్లల హక్కులు), ఇంటర్నెట్ సెక్యూరిటీపై అవగాహన కల్పిస్తున్నప్పటికీ అది సరిపోవడం లేదని కోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలోనే మరింత సమర్థవంతంగా ప్రచారం నిర్వహించాలని జాతీయ, రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్లకు ఆదేశాలు జారీ చేసింది. అభ్యంతరకర వెబ్‌సైట్లను ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు ఎప్పటికప్పుడు సమీక్షించి బ్లాక్ చేయాలని మద్రాస్ హైకోర్టు గుర్తుచేసింది.

Authored by: Vaddadi udayakumar

About admin

Check Also

చిన్నారి కీర్తికి కనకం కుటుంబం 20వేల రూపాయల ఆర్థిక సహాయం

పెద్దపెల్లి,ఐఏషియ న్యూస్: కనకం కుటుంబం వెల్ఫేర్ సొసైటీ వ్యవస్థాపక సభ్యులు అంబేద్కరిస్టు సామాజిక కార్యకర్త కీర్తిశేషులు కనకం విజయ్ పెద్దపెల్లి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *