బీహార్ ఎన్నికలవేళ తేల్చి చెప్పిన సుప్రీం కోర్ట్
న్యూఢిల్లీ,ఐఏషియ న్యూస్: మన దేశంలో ప్రభుత్వ గుర్తింపు కార్డుల్లో కీలకమైన ఆధార్ కార్డు ఎన్నికల్లో ఓటు హక్కు పొందేందుకు చెల్లుబాటయ్యే పత్రాల్లో ఒకటిగా ఎప్పటి నుంచో ఉంది. అయితే బీహార్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఆధార్ ను ఓటరుగా నమోదు అయ్యేందుకు తగిన పత్రంగా ఎన్నికల సంఘం గుర్తించకపోవడంతో వివాదం మొదలైంది. దీనిపై ఇప్పటికే ఈసీకి అక్షింతలు వేసిన సుప్రీంకోర్టు.. ఆధార్ ను తప్పనిసరిగా గుర్తింపు కార్డుగా స్వీకరించాల్సిందేనని ఇవాళ తేల్చిచెప్పేసింది.బీహార్ లో ప్రత్యేక ఓటరు జాబితాల సవరణ సందర్భంగా ఏకంగా 65 లక్షల ఓట్లను తొలగించిన ఎన్నికల సంఘం వాటికి సహేతుకమైన కారణాల్ని వివరించడంలో మాత్రం దారుణంగా విఫలమైంది. దీంతో ఈసీ చర్యను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ జరుపుతున్న సుప్రీంకోర్టు. ఆ 65 లక్షల ఓట్లను ఈసీ వెబ్ సైట్లో అప్ లోడ్ చేయాల్సిందేనని ఆదేశించింది. దీంతో జిల్లాల వారీగా ఆ 65 లక్షల ఓట్లను వెబ్ సైట్లలో అప్ లోడ్ చేసిన ఈసీకి ఇవాళ సుప్రీంకోర్టు మరో ఝలక్ ఇచ్చింది. ఈ సందర్భంగా బీహార్‌లోని రాజకీయ పార్టీలపైనా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. సాంప్రదాయకంగా తమకు ఓటు వేసే వర్గాల ఓట్లను తొలగించడానికి ఈసీ ఈ ఓటర్ల జాబితాల సవరణ చేపట్టిందనే కారణంతో వ్యతిరేకిస్తున్న పార్టీలపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయా పార్టీలో ఇలా ఓటు హక్కు కోల్పోయిన 65 లక్షలకు పైగా ఓటర్లకు ఆయా పార్టీలు ఎందుకు సాయం చేయలేదని ప్రశ్నించింది. రాజకీయ పార్టీలు తమ విధులను నిర్వర్తించడం లేదని వ్యాఖ్యానించింది.ఎస్ఐఆర్ పై అభ్యంతరాలను ఎంపీలు, ఎమ్మెల్యేలు దాఖలు చేశారని కానీ పార్టీలు కాదని గుర్తు చేసింది.
Authored by: Vaddadi udayakumar