పెద్దపల్లి/మంచిర్యాల,ఐఏషియ న్యూస్: లంచాలు తీసుకుంటూ తెలంగాణ రాష్ట్రం పెద్దపల్లి, మంచిర్యాలకు చెందిన ఇద్దరు అవినీతి అధికారులు మంగళవారం ఏసీబీ పట్టుబడ్డారు.
పెద్దపల్లిలో
పెద్దపల్లి సమీపంలోని ఓ భూమి సర్వేకు సంబంధించిన నఖల్లు ఇవ్వడానికి సర్వేయర్ సునీల్ రూ. 20 వేలు డిమాండ్ చేశారు. తాను అంతగా ఇవ్వలేనని తగ్గించాలని బాధితుడు అభ్యర్థించగా రూ. 10 వేలకు బేరం కుదుర్చుకున్నాడు. సర్వేయర్ సునీల్ తన ప్రైవేట్ అసిస్టెంట్ రాజేందర్ రెడ్డికి ఫోన్ పే చేయాలని బాధితునికి సూచించగా గత నెలలోనే ఈ డబ్బులను బదిలీ చేశారు. ఆ తరువాత సునీల్ అకౌంట్ కు ప్రైవేటు అసిస్టెంట్ బదిలీ చేయగా ఉన్నతాధికారుల అనుమతి తీసుకోవడంతో పాటు ఆడియో రికార్డు కూడా చేశారు. ఈ మేరకు మంగళవారం పెద్దపల్లి తహసీల్దార్ కార్యాలయంలో ఉన్న సునీల్, అతని ప్రైవేట్ అసిస్టెంట్ రాజేందర్ రెడ్డిలను అదుపులోకి తీసుకున్నామని కరీంనగర్ రేంజ్ ఏసీబీ డీఎస్పీ విజయ్ కుమార్ తెలిపారు. వీరిని కరీంనగర్ ప్రత్యేక కోర్టులో హాజరు పరుస్తామన్నారు.
రిటైర్డ్ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ నుంచి లంచం తీసుకుంటూ
మంచిర్యాల జిల్లా కోటపల్లి వైద్య ఆరోగ్య శాఖలో ఇంఛార్జి జూనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న జి.శ్రీనివాసులు మంగళవారం 6,000 రూపాయలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. వైద్య ఆరోగ్య శాఖలో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ గా పనిచేసి రిటైర్డ్ అయిన అధికారికి సంబంధించిన బెనిఫిట్స్ కోసం ఫైల్ తయారు చేసేందుకు జూనియర్ అసిస్టెంట్ శ్రీనివాసులు లంచం అడగగా, బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు.మంగళవారం మంచిర్యాల పట్టణంలోని ఓ హోటల్ లో శ్రీనివాసులు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. కేసు నమోదు చేసి ఏసిబి కోర్టుకు తరలించారు.
Authored by: Vaddadi udayakumar