దసరా నుంచి ఖాతాలో డిబిటి ద్వారా నేరుగా 15వేలు జమ
ఏపీ చీఫ్ బ్యూరో,ఐఏషియ న్యూస్: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు వాహనమిత్ర అమలు పైన ప్రకటన చేసారు. దసరా నుంచి ఈ పథకం అమల్లో భాగంగా అర్హత ఉన్న ప్రతీ ఆటో డ్రైవరు ఖాతాలో రూ 15 వేలు జమ చేయనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం ఇప్పటికే లబ్దిదారులు.. ఖర్చు.. నిధుల కేటాయింపు పైన కసరత్తు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 2.90 లక్షల మంది ఆటో డ్రైవర్లకు పథకం అమలు కానుంది. ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాల మేరకు అర్హత ఉన్న ప్రతీ ఆటో డ్రైవరుకు లబ్ది అందనుంది. నిధుల వినియోగం పైన ప్రభుత్వం విధి విధానాలు ఖరారయ్యాయి.
దక్కేది వీరికే
ఏపీ ప్రభుత్వం మరో పథకం అమలుకు ముహూర్తం ఫిక్స్ చేసింది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ద్వారా తాము ఆదాయం కోల్పోతున్నామని ఆటో డ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు వాహన మిత్ర అమలు చేయాలని డిమాండ్ చేసారు. దీంతో, తాజాగా బుధవారం జరిగిన అనంతపురం సభలో ఆటో డ్రైవర్లకు వాహనమిత్ర కింద రూ.15,000 చొప్పున సాయం అందించనున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఈ నిర్ణయంతో రాష్ట్రంలో 2.90 లక్షల మంది డ్రైవర్లకు ఆర్థికసాయం అందనుంది. మొత్తంగా వారు రూ.435 కోట్ల మేర లబ్ధి పొందనున్నారు. వైసీపీ హయాంలోవాహనమిత్ర కింద రూ.10 వేల చొప్పున మాత్రమే ఇచ్చారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వారికి రూ.15,000 ఇవ్వాలని నిర్ణయించింది.
విధానాలను ఖరారు చేసింది. సొంత వాహనం ఉండి దాన్ని నడిపే డ్రైవర్లకు ఈ పథకం వర్తిస్తుంది. 2023-24లో ఈ పథకం కింద 2.75 లక్షల మంది అర్హులున్నారు. ఇందులో ఆటో డ్రైవర్లు 2.5 లక్షల మంది, ట్యాక్సీ, మ్యాక్సీక్యాబ్‌ల డ్రైవర్లు 25 వేల మంది ఉన్నారు. తాజాగా వీరి సంఖ్య మరో 15 వేల వరకు పెరిగే అవకాశం ఉందని రవాణా శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో ఈ సారి 2.90 లక్షల మందికి ఆర్థిక సాయం అందుతుందని చెబుతున్నారు. రవాణా శాఖ ఉన్నతాధికారులు రాష్ట్రంలో ఆటోలు, ట్యాక్సీలు, మ్యాక్సీక్యాబ్‌లు ఎన్ని ఉన్నాయి, వాటి యజమానుల్లో ఎంతమంది డ్రైవింగ్ చేస్తూ ఉపాధి పొందుతున్నారనే తదితర వివరాలు సిద్దం చేసారు. ప్రతి డ్రైవర్ ఖాతాలో నేరుగా రూ.15,000 డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ ద్వారా జమ కానుంది.
వినియోగం ఇలా
ఇక, ఈ నిధులను ఈ సాయం వాహన బీమా, టైర్ల మార్పులు, ఇంధన ఖర్చులు, కుటుంబ అవసరాలు వంటి విషయాలకు ఉపయోగపడనుంది. దీంతో పాటుగా ఆటో రిపేర్లు, సర్వీసింగ్ ఖర్చులకు వినియోగించుకోవచ్చని చెబుతున్నారు. బీమా రీన్యువల్ కోసం ఉపయోగించుకునే వెసులుబాటు కలుగుతుంది. పిల్లల చదువుల కోసం సాయం అవుతుందని భావిస్తున్నారు. డ్రైవర్లకు కుటుంబ ఆర్థిక భారాన్ని కొంతవరకు తగ్గించేందుకు ఉపకరిస్తుంది. ఆటో డ్రైవర్లు సాధారణంగా రోజువారీ ఆదాయంపైనే ఆధారపడతారు. ఇంధన ధరలు పెరగడం, వాహనాల నిర్వహణ ఖర్చులు ఎక్కువ కావడం వల్ల చాలా మంది డ్రైవర్లు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు. ప్రభుత్వ తాజా నిర్ణయం వారికి ఉప శమనంగా మారనుంది.
Authored by: Vaddadi udayakumar