- తొలిరోజు తెలుగు డయాస్పోరా కార్యక్రమంలో పాల్గోనున్న సీఎం.
- భారత హైకమిషనర్ సహా సింగపూర్ పారిశ్రామిక ప్రతినిధులతో భేటీ.
- 5 రోజులు… 29 కార్యక్రమాల్లో పాల్గొననున్న సీఎం.
అమరావతి,ఐఏషియన్ న్యూస్: రాష్ట్రానికి భారీ ఎత్తున పెట్టుబడులు ఆకర్షించడం, బ్రాండ్ ఆంధ్రప్రదేశ్ ప్రమోషన్ లక్ష్యంలో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సింగపూర్ లో పర్యటించనున్నారు. శనివారం రాత్రి 11.15 గంటలకు హైదరాబాద్ నుంచి సింగపూర్‌కు ప్రయాణమవుతున్న సీఎం. ఆదివారం ఉదయం 6:25కి సింగపూర్ చాంఘీ ఎయిర్‌పోర్ట్‌కి చేరుకుంటారు. ఐదు రోజుల పాటు సింగపూర్‌లో ఆ దేశానికి చెందిన పారిశ్రామికవేత్తలు,పెట్టుబడిదారులు, సింగపూర్ ప్రభుత్వ ప్రతినిధులతో సమావేశం కానున్నారు.అలాగే వివిధ ప్రాంతాలను సందర్శించనున్నారు. ముఖ్యమంత్రి వెంట మంత్రులు నారా లోకేష్, టీజీ భరత్, నారాయణ సహా వివిధ శాఖల ఉన్నతాధికారులు కూడా సింగపూర్ లో పర్యటించనున్నారు. ఆదివారం ఉదయం 6 గంటలకు సింగపూర్ ఎయిర్ పోర్టుకు చేరుకోనున్న సిఎం చంద్రబాబు బృందం.పర్యటనలో తొలి రోజు మధ్యాహ్నం 2:00 గంటలకు ఓవిస్ ఆడిటోరియంలో జరిగే తెలుగు డయాస్పోరా ఫ్రం సౌత్ ఈస్ట్ ఏషియా కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ సమావేశానికి సింగపూర్‌తో పాటు మలేషియా, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, థాయ్‌లాండ్ తదితర దేశాల నుంచి తెలుగు పారిశ్రామిక వేత్తలు, వివిధ కంపెనీల ప్రతినిధులు, పెట్టుబడుదారులు, ఉద్యోగులు హాజరవుతారు. ఏపీ ఎన్ఆర్టీ సౌసైటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘తెలుగు డయాస్పోరా’కు దాదాపు 1,500 మంది ప్రతినిధులు హాజరు కానున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన నిరుద్యోగ యువతకు భారత్ తో పాటు వివిధ దేశాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించడంపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రవాసాంధ్రులను ఏపీ అభివృద్ధిలో భాగస్వామ్యం వహించేలా చేయటం , ఏపీ నుంచి ఎగుమతులు పెంచడానికి ఎన్నారైల ద్వారా అవసరమైన ప్రణాళికలు అమలు, నైపుణ్యాభివృద్ధి కల్పన ద్వారా యువతకు ఉద్యోగ అవకాశాల కల్పన వంటి అంశాలపై తెలుగు డయాస్పోరా సమావేశం దృష్టి సారించనుంది. అలాగే తెలుగు డయాస్పోరా వేదిక నుంచి జీరో పావర్టీ మిషన్ లో భాగమైన పి4 కార్యక్రమంలో భాగస్వాములు కావాలని తెలుగు పారిశ్రామిక వేత్తలు, ఎన్ఆర్ఐలను సీఎం చంద్రబాబు కోరనున్నారు.
Authored by: Vaddadi udayakumar