అమరావతి,ఐఏషియ న్యూస్: రాష్ట్రంలో కల్తీ మద్యం తయారీ, విక్రయాలను అరికట్టేందుకు ప్రత్యేక యాప్ తీసుకురావాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. ఈ విషయాన్ని ఏపీ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర శనివారం విలేకర్ల సమావేశంలో వెల్లడించారు. ములకలచెరువు నకిలీ మద్యం కేసులో ఇప్పటి దాకా 23 మందిని నిందితులుగా గుర్తించినట్లు కొల్లు రవీంద్ర తెలిపారు. 23 మంది నిందితుల్లో ఇప్పటి వరకూ 14 మందిని అరెస్టు చేసినట్లు వెల్లడించారు. అలాగే ఏ1గా ఉన్న అద్దేపల్లి జనార్దన్‌రావును కస్టడీలోకి తీసుకున్నట్లు మంత్రి వివరించారు. మిగిలిన నిందితులను కూడా త్వరలోనే అరెస్ట్ చేస్తామని వెల్లడించారు. కల్తీ మద్యం వ్యవహారాన్ని దర్యాప్తు చేయడానికి నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామన్న మంత్రి కొల్లు రవీంద్ర.. మన రాష్ట్రంతో పాటుగా హైదరాబాద్, బెంగళూరులోనూ ఈ బృందాలు విచారణ చేస్తున్నాయన్నారు.
మరోవైపు కల్తీ మద్యం గుర్తించేందుకు త్వరలోనే ప్రత్యేక యాప్ తేనున్నట్లు మంత్రి కొల్లు రవీంద్ర వెల్లడించారు. ప్రతి లిక్కర్ బాటిల్ మీద గతంలో ప్రత్యేకమైన కోడ్ ఉండేదన్న కొల్లు రవీంద్ర.. ఈ కోడ్ స్కాన్ చేసినప్పుడు.. ఆ లిక్కర్ ఎక్కడ తయారైంది? ఎక్కడి నుంచి ఎటు వెళ్లింది. దాని ధర ఎంత? వంటి వివరాలు తెలిసేవన్నారు.ఈ నేపథ్యంలోనే త్వరలోనే APTATS యాప్ అందుబాటులోకి తేనున్నట్లు కొల్లు రవీంద్ర వెల్లడించారు.
Authored by: Vaddadi udayakumar