(వడ్డాది ఉదయకుమార్)
ఏపీ చీఫ్ బ్యూరో,ఐఏషియ న్యూస్: కోనసీమ తిరుమలగా పేరొందిన తూర్పు గోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయ విశిష్టత అందరికి తెలిసిందే. అయితే ఈ తరం వారికి తెలియని ఇంకో ముఖ్యమైన చరిత్ర ఇక్కడ దాగి ఉంది. అదేంటంటే ఇక్కడ దైవ భక్తులతో పాటు దేశ భక్తులు పుష్కలంగా ఉన్నారు. స్వాతంత్రోద్యమంలో ప్రాణాలర్పించిన రోజులవి.ఈ ఊరు చిన్నదైనా అక్కడ నేల పొరల్లో దశాబ్దాల క్రితం త్యాగాల్ని నాటారు. రక్తాన్ని ధారపోశారు. ఈ త్యాగాలు ఆ పల్లె కోసం కాదు. యావద్భారతం కోసం. జాతి విముక్తి కోసం. అప్పట్లో దేశం మొత్తం మీద ఇలాంటి త్యాగాలు చేసిన అనేక పల్లెలుంటే అందులో ఇది ప్రముఖమైంది. ఆ త్యాగధనుల విశేషాలు ఏమిటి ? ఎందుకు వాడపల్లికి అంత గుర్తింపు వచ్చింది ?అనే విషయాలు తెలుసుకుందాం.
స్వామివారి రథంపై జాతీయజెండా ఎగిరినందుకు ప్రాణాలు తీశారు
అది 1931 మార్చి 30వ తేదీ చైత్ర శుద్ధ ఏకాదశి పర్వదినం. భారత స్వాతంత్ర్య సంగ్రామ చరిత్రలో చిరస్మరణీయం.ఆరోజు మాతృదాశ్య శృంఖలాల విమోచనోద్యమ రధసారధి పూజ్య బాపూజీ శంఖారావానికి ప్రతిస్పందించిన స్వాతంత్ర్య యోధులు బ్రిటిష్ పాలకుల నిరంకుశ పాలనను సంఘటితంగా ప్రతిఘటించిన పవిత్ర దినం.తమ ప్రియతమ నేత బాపూజీ చిత్ర పటాన్ని, త్రివర్ణ పతాకాన్ని వెంకటేశ్వరస్వామి రథోత్సవ వేడుకల్లో భక్తితో పాటు దేశభక్తి చాటిచెప్పేందుకు ఎగరవేశారు. ఈ మువ్వెన్నెల జెండాకు అప్పుడున్న గౌరవం వేరు. ఆ జెండా పేరు చెబితే తెల్లవాడికి ముచ్చెమటలు పట్టేవి. మనవాళ్లకు నరాలు బిగిచుకునేవి. దానికి తోడు గాంధీజీ ఫోటోను రధానికి తగిలించారు. రధం కదిలింది.శత్రుస్థావరం మీదకు దండెత్తుతున్న సైనికుల్లా పల్లె ప్రజలు కదలివచ్చారు.
ముస్తపా ఆలీఖాన్ దుర్మార్గపు చర్య
అప్పటి రాజమండ్రి డిప్యూటీ సూపరింటెండెంట్ పోలీస్ గా పనిచేసే ముస్తపా ఆలీఖాన్ రంగంలో దిగారు. ఆయన అప్పటికే సీతానగరంలోని గాంధీ ఆశ్రమాన్ని చిన్నాభిన్నం చేసి అక్కడ వారిని రక్తమోడేలా కొట్టడంతో బ్రిటిష్ అధికారుల వద్ద మంచి గుర్తింపు పొందాడు. అలాంటి అలీఖాన్ రథంపై జాతీయ జెండా తీసేయాలని, గాంధీ చిత్రాన్ని తొలగించాలని హెచ్చరించారు. అయితే అక్కడ ప్రజలు ఎవరు వెనక్కి తగ్గలేదు. రధాన్ని ముందుకు తీసుకెళుతున్న తరుణంలో గాలిలో కాల్పులు జరిపించారు.అయినప్పటికీ ఎవరూ బెదరలేదు.దీంతో పరిస్థితి చేజారుతుందని గుర్తించిన ఆలీఖాన్ ప్రజలపైకి తన బలగాలతో తూటాల వర్షం కురిపించారు. ఎందరో ఈ సంఘటనలో నేలకొరిగి అమరులయ్యారు.మరెందరో గాయాలతో క్షతగాత్రులయ్యారు. అయినప్పటికీ ప్రజలు ప్రాణభయంతో పారిపోలేదు.బ్రిటిష్ సైనికులపై తిరగబడ్డారు.ముఖ్యంగా అలీఖాన్ తుదిమట్టుంచేదుకు కధం తొక్కారు.ఆలీఖాన్ ఎవరో గుర్తుపట్టలేకపోయారు. ఖాకీ దుస్తులతో ఉన్న వ్యక్తి అలీఖాన్ అనుకుని మీదపడటంతో అతడు ప్రాణాలు విడిచాడు.అయితే ఆతర్వాత తెలిసింది అలీఖాన్ అప్పటికే అక్కడినుండి పరారయ్యాడని.
ఆలయం ముందు స్మారక స్థూపం ఏర్పాటు
వాడపల్లిలో జరిగిన ఈ వీరోచిత సంఘటన బ్రిటిష్ వారినే అబ్బురపరిచింది. ఆ సంకుల సమరంలో అసువులు బాసిన అమర వీరులు, క్షతగాత్రులు అయిన ధన్యజీవుల కవోష్ణరుధిర ధార పరిప్లావితమైన ఆ పవిత్ర ప్రదేశంలో నిర్మించిన స్మారక చిహ్నమే ఈ స్థూపం. స్వర్గీయ కరటూరి సత్యనారాయణ (కట్టంగ గ్రామం), స్వర్గీయ పాతపాటి వెంకటరాజు (ఆలమూరు గ్రామం), స్వర్గీయ వాడపల్లి గంగాచలం,స్వర్గీయబండారునారాయణస్వామి(రెండు కాళ్లు తీసివేశారు బుల్లెట్ గాయాలతో).అయితే ఆరోజు జరిగిన ప్రజాప్రతిఘటనను కుట్రగాను, స్వాతంత్ర సమరయోధులను ముద్దాయిలుగాను అప్పటిసాయుధదళాలపోలీసులుచిత్రించారు.నంబూరి జగ్గరాజు,నామన బాపన్న, పెన్మెత్స సత్యనారాయణరాజు, దాట్ల సత్యనారాయణరాజు, పెన్మెస్స వెంకట నరసింహారాజు,చేకూరి సూర్యనారాయణరాజు, చేకూరి రామరాజు, ముదునూరి గనిరాజు, మెర్ల శాస్త్రులు,సాగిరాజు వెంకట సుబ్బరాజు, సాగిరాజు వెంకటరాజు, తూము వెంకన్న, ముదునూరి నారాయణరాజు, ఇందుకూరి సూర్యనారాయణ రాజు, సఖినేటి సుబ్బరాజు, నంబూరి తాతరాజు, దంతులూరి లక్ష్మీపతి రాజు, పడాల సుబ్బారెడ్డి, దండు జగ్గరాజు, ముదునూరి సుబ్బరాజు, మైపాల రామన్న, ఇందుకూరి రామరాజు, ముదునూరి సూర్యనారాయణరాజు, మద్దిపాటి సత్యనారాయణ ఈ ముద్దాయిలందరూ నిర్దోషులని పోలీసుల అభియోగాన్ని దారుణమని జిల్లాన్యాయాధికారి 23 నవంబర్ 1931వ తేదీన తీర్పునిచ్చారు.న్యాయాధిపతులు జస్టిస్ కె పి లక్ష్మణరావు, జస్టిస్ ఎం ఆర్ శంకరయ్య, ముద్దాయిలకు అండగా కేసును సాక్షులను సేకరించిన వారు కళా వెంకట్రావు.ఈ సంఘటనకు గుర్తుగా వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయం ముందు స్వాతంత్ర సమరయోధుల శిలాఫలకంను కొత్తపేట మాజీ ఎమ్మెల్యే మంతెన వెంకట సుబ్బరాజు 1987 అక్టోబర్ 2 గాంధీ జయంతి వేడుకల సందర్భంగా ప్రారంభించారు.బాధాకరమైన విషయం ఏమిటంటే వాడపల్లి వెంకటేశ్వరస్వామి ఆలయానికి వచ్చే భక్తులు చెప్పులను ఈ స్థూపం వద్ద విడిచి దేవాలయంలోకి వెళుతున్నారు. అంటే వారికి దేశభక్తి లేదని కాదు.అక్కడ అంత చరిత్ర కలిగిన స్థూపం ఉందని తెలియకనే.అలాగే భక్తులు స్థూపంపై చేతులు వేసేయడం వల్ల తరచూ రంగులు చెరిగిపోయి మసివారిపోతుంది.
స్థూపాన్ని సెల్ఫీ పాయింట్ గా మార్చడానికి కలెక్టర్ అనుమతులు
వాడపల్లి వచ్చే భక్తులు రోజురోజుకు విపరీతంగా పెరుగుతూ వస్తున్నారు. అయితే ఈ ఆలయానికి ఎదురుగా హుండీలు మధ్యన ఉండే స్థూపాన్ని మార్చడానికి కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు,డిప్యూటీ కమిషనర్, ఆలయ ఈవో నల్లం చక్రధరరావులు చేసిన ప్రయత్నాలు ఫలిస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న ప్రదేశం నుంచి ఈ స్మారక స్థూపాన్ని కొత్తగా నిర్మిస్తున్న కోనేరు వద్ద ఏర్పాటు ప్రతిపాదనకు జిల్లా కలక్టర్ నుంచి అనుమతులు వచ్చాయి.దేశవ్యాప్తంగా తరలివస్తున్న భక్తులకు ఇక్కడ దేశభక్తుల విశిష్టతను తెలియజేయడానికి ఈ సెల్ఫీ పాయింటు ఎంతో దోహదపడనుంది.వెంకటేశ్వర స్వామి తీర్దమత్సవాల్లో రథంపై జాతీయ జెండా ఎగరేసినందుకు బ్రిటిష్ వారు చేసిన ఈ దుర్మార్గపు చర్య, దానిని ఎదుర్కొన్న అమరవీరుల చరిత్ర పదికాలాలు పాటు పటిష్ఠంగా ఉండేందుకు ఈ నూతన ఏర్పాట్లు ఎంతో దోహదపడతాయని చెప్పవచ్చు. వెంకటేశ్వర స్వామి భక్తులు బ్రిటిష్ వారిని ఎలా ఎదిరించారు,తుపాకీల తూటాలకు ఎలా ప్రాణాలు కోల్పోయారు వంటి చరిత్ర స్పష్టం చేస్తుంది. ఆ మారుమూల గ్రామంలో స్వతంత్ర పోరాట యోధుల గొప్పదనాన్ని అందరికీ తెలియజేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని వాడపల్లి వెంకన్న భక్తులు కొండ్రెడ్డి లక్ష్మీ శ్రీనివాస్ కోరుతున్నారు.
Authored by: Vaddadi udayakumar