పాట్నా,ఐఏషియ న్యూస్: బీహార్లో అనేక వివాదాలకు నెలవుగా మారిన ఓటరు జాబితా ప్రత్యేక సవరణను పూర్తి చేసిన ఎన్నికల సంఘం తుది ఓటరు జాబితాను ప్రకటించింది. ఎస్ఐఆర్ డ్రాఫ్ట్ జాబితాపై వచ్చిన అన్ని అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుని ఈ జాబితాను తయారు చేసినట్టు తెలిపింది. బీహార్లో ప్రధాన ఎన్నికల అధికారి తన సోషల్ మీడియాలో ఈ ప్రకటన చేశారు.
త్వరలోనే ఎన్నికల షెడ్యూల్?
బీహార్ ఓటరు తుది జాబితా ప్రకటించడంతో వచ్చేవారం బీహార్ శాసనసభ ఎన్నికల షెడ్యూలును కూడా ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. అక్టోబర్ చివరలో ఛట్ పండగ తర్వాత తొలిదశ ఎన్నికలు నిర్వహించనున్నట్టు సమాచారం. బీహార్ ఎన్నికలతో పాటు దేశంలోని ఇతర ప్రాంతాల్లో జరగనున్న ఉప ఎన్నికల కోసం ఈసీ 470 మంది పరిశీలకుల్ని నియమించింది. ఈనెల 3న సాధారణ, పోలీసు, వ్యయ పరిశీలకుల వివరాలపై ప్రకటన వెలువడుతుందని అధికారిక వర్గాలు వెల్లడించాయి.
Authored by: Vaddadi udayakumar