తుని తలుపులమ్మలోవ ఆలయానికి ఎస్కలేటర్ సౌకర్యం

  • 17 కోట్ల వ్యయంతో అమ్మవారి ఆలయం పునర్నిర్మాణం
  • నాలుగు కోట్లతో ఎస్కలేటర్ ఏర్పాటు

స్పెషల్ డెస్క్,ఐఏషియ న్యూస్: ఆంధ్రప్రదేశ్‌లోనే తొలిసారిగా ఓ ఆలయంలో భక్తుల సౌకర్యం కోసం ఎస్కలేటర్ ఏర్పాటు చేస్తున్నారు. కాకినాడ జిల్లాలోని తునిలో ఉన్న తలుపులమ్మ లోవ అమ్మవారి గుడిలో ఎస్కలేటర్‌ ఏర్పాటు చేస్తున్నారు. 17 కోట్ల రూపాయలతో తలుపులమ్మ అమ్మవారి ఆలయంలో పునర్నిర్మాణ పనులు చేపడుతున్నారు. ఇందులో భాగంగానే నాలుగు కోట్ల రూపాయలతో ఎస్కలేటర్ ఏర్పాటు చేసేందుకు చర్యలుచేపడుతున్నారు. ఎస్కలేటర్ ఏర్పాటైతే ఆంధ్రప్రదేశ్‌లోనే ఈ సౌకర్యం ఏర్పాటుచేస్తున్న మొదటి దేవాలయం తలుపులమ్మలోవ ఆలయమేనని అధికారులు చెబుతున్నారు. మరోవైపు ఎస్కలేటర్ అందుబాటులోకి వస్తే ఎక్కువమంది భక్తులు ఒకేసారి ఆలయ ప్రాంగణానికి చేరుకునే అవకాశం ఉందని దేవాలయ ఈవో పెన్మత్స విశ్వనాథరాజు చెప్తున్నారు. భక్తులకు సౌకర్యంగా ఉంటుందని వివరిస్తున్నారు.మరోవైపు చుట్టూ కొండలతో ఈ ప్రాంతం రమణీయంగా ఉంటుంది. ధారకొండ, తీగకొండ అనే రెండు కొండల నడుమ అమ్మవారు తలుపులమ్మగా కొలువై ఉన్నారు. కోరిన కోరికలు(తలుపులు) నెరవేర్చే దేవతగా అమ్మవారు తలుపులమ్మగా ప్రసిద్ధి చెందినట్లు స్థానికులు చెప్తున్నారు. పురాణాల ప్రకారం కృతయుగంలో అగస్త్య మహర్షి ఈ ప్రాంతానికి వచ్చారు. అయితే మహర్షి సంధ్యావందనం చేసుకోవాలని భావించగా.. ఎక్కడా నీరు కనిపించలేదు. దీంతో అగస్త్య మహర్షి జగన్మాతను ప్రార్థించగా, దేవి కృపతో కొండపైన పాతాళగంగ ఉప్పొంగింది. అనంతరం సంధ్యా వందనం పూర్తి చేసుకున్న అగస్త్య మహర్షి.. అమ్మవారిని ఈ ప్రాంతంలోనే కొలువై ఉండాలని కోరటంతో అమ్మవారు కొండ గుహలో కొలువు దీరినట్లు స్థల పురాణం.అంతేకాకుండా ఆషాఢ మాసంలో అమ్మవారి దర్శనం కోసం భక్తులు పోటెత్తుతూ ఉంటారు. వివిధ జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో వస్తుంటారు.ముఖ్యంగా ఆదివారం, మంగళ, బుధ, గురువారాల్లో తాకిడి ఎక్కువగా ఉంటుంది. అయితే భక్తుల రద్దీ అధికంగా ఉన్న సమయంలో ఆలయ ప్రాంగణం వరకూ చేరుకోవాలంటే భక్తులకు ఇబ్బందిగా ఉంటుంది. కొండ ప్రాంతం కావటంతో సమస్యలు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఎస్కలేటర్ ఏర్పాటు చేసే ఆలోచన చేశారు దేవస్థానం అధికారులు.అందులో భాగంగానే రూ.4 కోట్లతో ఎస్కలేటర్ ఏర్పాటు కోసం చర్యలు ప్రారంభించారు. ఈ ఎక్సిలేటర్ వల్ల భక్తులకు మంచి సౌకర్యంగా ఉంటుందని అధికారులు భావిస్తున్నారు.

Authored by: Vaddadi udayakumar

About I Asia News

Check Also

హిందూ దేవాలయాలకు రాయితీపై దేవత విగ్రహాలు,మైక్ సెట్,గొడుగులు,శేష వస్త్రాలు విక్రయం

తిరుమల,ఐఏషియ న్యూస్: తిరుమల తిరుపతి దేవస్థానం మరో కీలక నిర్ణయం తీసుకుంది. సనాతన హిందూ ధర్మ ప్రచారంలో భాగంగా ఆలయాలకు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *