విజయవాడ కనకదుర్గ గుడి విద్యుత్ సరఫరా నిలిపివేత

విజయవాడ,ఐఏషియ న్యూస్: ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం విజయవాడ కనకదుర్గ గుడికి విద్యుత్ సరఫరా నిలిపివేశారు. కరెంట్ బిల్లు బకాయిలు ఉన్నాయంటూ ఏపీసీపీడీసీఎల్ అధికారులు ఈ చర్యలు తీసుకున్నారు. విజయవాడ దుర్గ గుడి దేవస్థానం రూ.3.08 కోట్లు విద్యుత్ బిల్లులు బకాయిలు ఉందంటూ ఏపీసీపీడీసీఎల్ ఈ చర్యలు తీసుకుంది. అయితే విజయవాడ దుర్గ గుడికి వచ్చే భక్తులను దృష్టిలో పెట్టుకుని దేవస్థానం అధికారులు ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టారు.
జనరేటర్ సాయంతో ఆలయంలో విద్యుత్ సేవలకు ఆటంకం లేకుండా చర్యలు తీసుకున్నారు. మరోవైపు విద్యుత్ శాఖ అధికారులతో దేవస్థానం సంప్రదింపులు జరిపింది. భక్తుల మనోభావాలను దృష్టిలో పెట్టుకోవాలనికోరింది. దీంతో మూడు గంటల అనంతరం విజయవాడ దుర్గ గుడికి కరెంట్ సరఫరాను పునరుద్ధరించారు.ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే విద్యుత్ బిల్లు చెల్లించలేదంటూ ఏపీసీపీడీసీఎల్.. విజయవాడ కనకదుర్గమ్మ దేవస్థానానికి శుక్రవారం నోటీసులు ఇచ్చింది. శనివారం కరెంట్ సరఫరాను నిలిపివేసింది. 2023 ఫిబ్రవరి నుంచి దుర్గ గుడి దేవస్థానం కరెంట్ బిల్లు బకాయిలు చెల్లించలేదని విద్యుత్ శాఖ అధికారులు చెప్తున్నారు ఈ బకాయిలు సుమారుగా రూ.3.08 కోట్లు ఉన్నట్లు సమాచారం. విద్యుత్ బకాయిలు చెల్లించాలని పలుమార్లు కోరినప్పటికీ.. దేవస్థానం నుంచి స్పందన లేదని ఏపీసీపీడీసీఎల్ అధికారులు చెప్తున్నారు. దీంతో శనివారం దుర్గ గుడికి విద్యుత్ సరఫరా నిలిపివేసినట్లు విద్యుత్ శాఖ అధికారులు పేర్కొన్నారు.
దుర్గగుడి అధికారుల స్పందన
అయితే ఈ ఘటనపై విజయవాడ కనకదుర్గమ్మ దేవస్థానం అధికారుల స్పందన మరోలా ఉంది. దుర్గ గుడి అవసరాలకు తాము సోలార్ ప్లాంట్ నుంచి వచ్చే కరెంట్ వాడుతున్నట్లు చెప్తున్నారు. నెట్ మీటరింగ్ కోసం విద్యుత్ శాఖ అధికారులను పలుమార్లు కోరామని.. అయితే వారు ఈ ఏర్పాటు చేయలేదని చెప్తున్నారు. దీంతో సోలార్ ప్లాంట్ నుంచి ఉత్పత్తి అయ్యే కరెంట్ లెక్కలు తేలటం లేదంటున్నారు.అప్పారావుపేట, పాముల కాలువ వద్ద ఏర్పాటు చేసిన సోలార్ ప్లాంట్ నుంచి రెండేళ్లుగా ఏపీ విద్యుత్ మండలికి ఉచితంగా కరెంట్ అందిస్తున్నామని బదులుగా విద్యుత్ శాఖ దేవస్థానానికి చెందిన 10 సర్వీసులకు ఉచితంగా కరెంట్ సరఫరా చేస్తోందన్నారు.ఈ సర్వీసులకు సంబంధించిన బిల్లులను చెల్లించాలని అడుగుతున్నట్లు చెప్తున్నారు.మరోవైపు దుర్గ గుడి దేవస్థానం, విద్యుత్ శాఖ అధికారుల మధ్య సంప్రదింపుల తర్వాత మూడు గంటల అనంతరం దుర్గ గుడికి విద్యుత్ సరఫరా పునరుద్ధరించారు. అయితే దుర్గ గుడికి కరెంట్ సరఫరా నిలిపివేయటంపై భక్తులు మండిపడుతున్నారు. కారణమైన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

Authored by: Vaddadi udayakumar

About I Asia News

Check Also

హిందూ దేవాలయాలకు రాయితీపై దేవత విగ్రహాలు,మైక్ సెట్,గొడుగులు,శేష వస్త్రాలు విక్రయం

తిరుమల,ఐఏషియ న్యూస్: తిరుమల తిరుపతి దేవస్థానం మరో కీలక నిర్ణయం తీసుకుంది. సనాతన హిందూ ధర్మ ప్రచారంలో భాగంగా ఆలయాలకు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *