- మీ రుణం తీర్చుకునేందుకే ఆటోడ్రైవర్ సేవలో పథకాన్ని ప్రవేశపెట్టాం
- ఆటోడ్రైవర్ సేవలో కార్యక్రమంలో రాష్ట్ర విద్య, ఐటి శాఖల మంత్రి లోకేష్
అమరావతి,ఐఏషియ న్యూస్: గత ఎన్నికల్లో ప్రజలు మాపైన ఒక పవిత్ర బాధ్యత పెట్టారు. గత పాలకులు మీటింగ్ పెడితే పరదాలు, బారికేడ్లు కట్టేవారు. ఈరోజు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి సామాన్యుల మాదిరి మీ ముందుకు వచ్చారు. మీ రుణం తీర్చుకోవడమే మా లక్ష్యం. అహర్నిశలు కష్టపడి ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఇచ్చిన ప్రతిహామీ నిలుపుకునే బాధ్యత ప్రజా ప్రభుత్వం తీసుకుంటుందని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు. ఆటోడ్రైవర్ సేవలో పథకం ప్రారంభోత్సవం సందర్భంగా విజయవాడ సింగ్ నగర్ మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో నిర్వహించిన కార్యక్రమానికి మంత్రి లోకేష్ అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో డబుల్ ఇంజన్ సర్కారు ఉంది. కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోడీ, రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నేతృత్వంలో డబుల్ ఇంజన్ సర్కారు అద్భుతంగా పనిచేస్తుండటం వల్లే ఎన్ని ఇబ్బందులున్నా ఇచ్చిన ప్రతి హామీ నిలబెట్టుకుంటున్నాం, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయగలుగుతున్నాం. ఇది మీ అందరి ప్రభుత్వం… మళ్ళీ వస్తాం… మీ పిల్లల భవిష్యత్తు చూసుకునే బాధ్యత ప్రజా ప్రభుత్వం తీసుకుంటుందని మంత్రి లోకేష్ పేర్కొన్నారు.ఇంట్లో ఎన్ని ఇబ్బందులు ఉన్నా… ఆటో ఎక్కిన వారిని నవ్వుతూ పలకరించేది ఆటో డ్రైవర్లు. గ్రామ స్థాయి నుండి రాష్ట్ర రాజకీయాల వరకూ చర్చించేది ఆటోలోనే అని రాష్ట్ర విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు. విశ్వవిఖ్యాత నటసార్వభౌమ స్వర్గీయ నందమూరి తారకరామారావు గారు డ్రైవర్ గా నటించిన సినిమా డ్రైవర్ రాముడు. మీ అందరి బాలయ్య.. నా ముద్దుల మావయ్య డ్రైవర్ గా నటించిన సినిమా లారీ డ్రైవర్. పవనన్న డ్రైవర్ గా నటించిన సినిమా అత్తారింటికి దారేది. అన్న ఎన్టీఆర్ ఖాకీ డ్రెస్సు వేసి చైతన్యరథంపై తిరిగితే ఢిల్లీ గడగడ లాడింది. మన ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి ఆటో డ్రైవర్ల కష్ఠాలు బాగా తెలుసు. ఆయన ఎప్పుడు అధికారంలో ఉన్నా ఆటో డ్రైవర్లకు సహాయం అందిస్తూనే ఉన్నారు. వారి కష్టాలు తీర్చేందుకే ఇప్పుడు మన ప్రజా ప్రభుత్వం ఆటో డ్రైవర్ల సేవలో పథకం ప్రారంభించింది. ఆటో వెనకాతల రాసే కొటేషన్లు గురించి లోకేష్ ప్రస్తావించారు.
Authored by: Vaddadi udayakumar