- ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంలో రాష్ట్రంలో పది మెడికల్ కాలేజీలు
- ఏపీ రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం
- సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ క్యాబినెట్ సమావేశం
ఏపీ చీఫ్ బ్యూరో ఐఏషియ న్యూస్: అమరావతిలో గురువారంసమావేశమైన ఏపీ కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇందులో ప్రధానంగా ఆయుష్మాన్ భారత్ – పీఎంజేఏవై-డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం క్రింద హైబ్రిడ్ మోడ్‌లో యూనివర్సల్ హెల్త్ పాలసీ రూపకల్పనకు ఇన్సూరెన్స్ కంపెనీల నుంచి టెండర్లు పిలవాలని నిర్ణయించింది. ఒక్కో కుటుంబానికి ప్రతీ సంవత్సరానికి రూ.25 లక్షల వరకు ఫ్రీగా మెడికల్ ట్రీట్‌మెంట్ అందించనున్నారు.
దీంతో రాష్ట్రంలోని దాదాపు 5 కోట్ల మందికి నాణ్యమైన వైద్య సేవలు లభిస్తాయి. ఈహెచ్ఎస్ లో కవర్ అయ్యే ఉద్యోగులు మినహా మిగతా వారందరికీ ఈ పథకం లభిస్తుంది. రోగి ఆసుపత్రిలో చేరిన ఆరు గంటల్లోపు అప్రూవల్ ఇచ్చే విధంగా నిబంధనలు విధిస్తారు.ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యం కింద ఆదోని, మదనపల్లి, మార్కాపురం, పులివెందుల, పెనుగొండ, పాలకొల్లు, అమలాపురం, నర్సీపట్నం, బాపట్ల , పార్వతీపురంలో 10 కొత్త మెడికల్ కాలేజీలు అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. ఈ కాలేజీల్లో 2027-28 విద్యా సంవత్సరం నుండి అడ్మిషన్లు జరిగే విధంగా నిర్మాణాలను పూర్తి చేస్తారు. మరోవైపు సీఆర్డీఏ అమరావతిలో భూమిని కేటాయించిన విద్య, ఆరోగ్య సంరక్షణ సంస్థలకు అమ్మకం-లీజు ఒప్పందాలను అమలుచేసేటప్పుడురీయింబర్స్‌మెంట్ ప్రాతిపదికన స్టాంప్ డ్యూటీ చెల్లింపు నుండి మినహాయింపు ఇవ్వనున్నారు.
.రాష్ట్రంలో ఆగస్టు 31 వరకూ రాజధాని ప్రాంతం మినహా మిగిలిన చోట్ల నిర్మించిన అనధికారిక నిర్మాణాలపై చర్యలు తీసుకునేందుకు వీలుగా ముసాయిదా ఆర్డినెన్స్ జారీకి ఆమోదం తెలిపారు. రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు నిర్ణయాలకు ఆమోదం తెలిపారు. గతేడాది ఆగస్టు-సెప్టెంబర్‌లో వరదల కారణంగా జరిగిన నష్టాలకు గన్నవరం, నూజివీడు, జగ్గయ్యపేట, తిరువూరు, నందిగామ, విజయవాడ సెంట్రల్, పెనమలూరు, జగ్గంపేట, పిఠాపురం, నిడదవోలు, తాడేపల్లిగూడెం, గోపాలపురం, తణుకు అసెంబ్లీ నియోజకవర్గాలలో రూ.5714.58 లక్షల రూపాయలతో 392 ఇరిగేషన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ వరద నష్ట మరమ్మతు,పునరుద్ధరణ పనులకు ఆమోదం తెలిపారు.ఏపీ మోటార్ వాహనాల చట్టంలో రవాణా వాహనాలకు సంబంధించి “గ్రీన్ టాక్స్” రేటును తగ్గించడానికి, వాణిజ్య ప్రయోజనాల కోసం ఉపయోగించే ట్రాక్టర్, ట్రైలర్‌లతో సహా వస్తువుల క్యారేజీ వాహనాలు చెల్లించాల్సిన త్రైమాసిక పన్ను ఆధారంగా కాకుండా రూ.1,500, రూ.3,000/- గా కొత్త పన్ను రేట్లను అమలు చేసేందుకు చట్టసవరణ చేయనున్నారు. రాజధాని ప్రాంతంలో రత్నాలు , ఆభరణాల పార్క్ ఏర్పాటు కోసం గుంటూరు జిల్లా మంగళగిరి మండలం ఆత్మకూరు గ్రామంలో 78.01 ఎకరాల విస్తీర్ణంలో “మంగళగిరి గోల్డ్ క్లస్టర్ ల్యాండ్ పూలింగ్ స్కీమ్”ను ప్రారంభించడానికి , అమలు చేయడానికి సీఆర్డీఏ కమిషనర్ కు అధికారం ఇచ్చారు. దీపం-2 పథకం కింద అర్హత కలిగిన 5 కిలోల ఎల్పీజీ సిలిండర్లను 14.2 కిలోల దేశీయ ఎల్పీజీ సిలిండర్లుగా మార్చడానికి వినియోగదారుల వ్యవహారాలు, ఆహార,పౌర సరఫరాల శాఖ చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది.దీంతో పాటు పలు చట్టాల్ని తాజా అవసరాల మేరకు సవరించేందుకు బిల్లుల తయారీకి ఆమోదం తెలిపారు.ఈ సమావేశంలో పలువురు మంత్రులు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Authored by: Vaddadi udayakumar