నేటి నుంచి ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్టుల బంద్

  • బకాయిలు చెల్లిస్తేనే వైద్య సేవలు చేస్తాం అన్న ప్రైవేటు హాస్పిటల్ సంఘం
  • 2,700 కోట్ల బకాయిలు విడుదల చేయాలని ప్రభుత్వానికి డిమాండ్

ఏపీ స్టేట్ బ్యూరో ,ఐఏషియ న్యూస్: ఏపీలో శుక్రవారం నుంచి ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లే వారికి చుక్కలు కనిపించబోతున్నాయి. ముఖ్యంగా ఎన్టీఆర్ వైద్య సేవ పథకాన్ని వాడుకునేందుకు వీల్లేగుండా ప్రైవేటు ఆస్పత్రుల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. రేపటి నుంచి ఈ సేవల్ని నిలిపేయాలని నిర్ణయించింది. దీంతో రోగులు తమ సొంత డబ్బులు పెట్టి మరీ వైద్యం చేయించుకోక తప్పని పరిస్ధితులు ఎదురుకాబోతున్నాయి.ఏపీలో గతంలో ఆరోగ్యశ్రీగా ఉండి కూటమి సర్కార్లో ఎన్టీఆర్ వైద్య సేవగా మారిన పథకం బకాయిలు భారీగా పేరుకుపోయాయి.
ఇప్పటివరకూ బకాయిలు రూ.2700 కోట్లు దాటిపోయాయని ఏపీ స్పెషాలిటీ ఆస్పత్రుల అసోసియేషన్ (ఆశా) ఓ ప్రకటనలో తెలిపింది. దీనిపై ప్రభుత్వానికి పలుమార్లు విన్నవించుకున్నా ఫలితం లేకపోవడంతో శుక్రవారం నుంచి ఎన్టీఆర్ వైద్య సేవల్ని నిలిపేస్తున్నట్లు ఓ ప్రకటనలో తెలిపింది. నెట్వర్క్ ఆసుపత్రులకు ఎన్టీఆర్ ట్రస్ట్ నుంచి బకాయిలు చెల్లించక పోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఏపీ స్పెషాలిటీ ఆసుపత్రుల అసోసియేషన్ తెలియజేసింది.ఎన్టీఆర్ వైద్య సేవ నెట్ వర్క్ ఆస్పత్రుల బతుకు భారమైందని, ఇంతకాలం కాళ్లీడ్చుకుంటూ కాలం వెళ్లదీసిన నెట్ వర్క్ ఆస్పత్రులు ఇక కాలు కదపలేని పరిస్ధితుల్లో ఉన్నట్లు సంఘం తెలిపింది. అందుకే ఈ నెల 10 నుంచి వైద్య సేవలు నిలివేస్తున్నట్లు తెలిపింది. ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు ఏనెల కానెల పెరుగుతూనే ఉన్నాయి తప్ప తగ్గడం లేదని వెల్లడించింది. బకాయిల చెల్లింపుపై తాము ప్రభుత్వ పెద్దల్ని కలిసి ఎన్నిసార్లు విన్నవించినా,అదిగో చేస్తాం, ఇదిగో చేస్తాం అని చెబుతున్నారే తప్ప ఆ దిశగా ప్రయత్నాలు కనిపించడం లేదని ఆరోపించింది.
అసెంబ్లీలో వైద్యారోగ్యమంత్రి సత్యకుమార్ ఆస్పత్రుల బకాయిల వివరాలు వెల్లడించినా డబ్బులు మాత్రం రాలేదన్నారు. గత వారం రోజులుగా కలెక్టర్లు, ఎమ్మెల్యేలు, మంత్రుల్ని కలిసి తమ ఆవేదన విన్నవించామని, అయినా ఫలితం లేదన్నారు. కాబట్టి శుక్రవారం నుంచి ఎన్టీఆర్ వైద్యసేవను నిలిపేస్తున్నామని, దీనికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని సంఘం ప్రతినిధులు ప్రభుత్వానికి సూచించారు. ఏడాది కాలంగా తాము పడుతున్న ఇబ్బందులు ప్రజలు అర్ధం చేసుకోవాలన్నారు.
Authored by: Vaddadi udayakumar

About admin

Check Also

కేజీహేచ్ లో విద్యార్థినులను పరామర్శించిన హోం మంత్రి అనిత

విశాఖపట్నం,ఐఏషియ న్యూస్:  పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం ఏకలవ్య బాలికల గురుకుల పాఠశాలలో అస్వస్థతకు గురై కేజీహెచ్ లో చికిత్స …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *