అమరావతి,ఐఏషియ న్యూస్: రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్న పవన్ కళ్యాణ్, అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. మంత్రిగా రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉంటూ పరిపాలనను గాలికొదిలేసి, రాష్ట్రానికి చుట్టం చూపుగా వస్తు, సినిమాలపైనే శ్రద్ధ వహిస్తూ,ఎక్కువ కాలం హైదరాబాద్‌లోనే గడుపుతున్నారని ఏకంగా రాష్ట్ర అత్యున్నత ధర్మాసనంలో పిటిషన్ వేశారు మాజీ ఐఏఎస్ అధికారి విజయ్‌కుమార్.జనసేన అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌పై విజయ్‌కుమార్ దాఖలు చేసిన పిటిషన్‌పై సోమవారం వాదనలు జరిగాయి. మంత్రి పదవిలో కొనసాగుతూ సినిమాల్లో నటించడం చట్టబద్ధమేనా? అనే ప్రశ్నపై కోర్టు విచారణ చేపట్టింది. అయితే ఈ కేసులో పబ్లిక్ ప్రాసిక్యూటర్ అప్పీరవుతారని ప్రభుత్వం తరఫు న్యాయవాది తెలుపగా, ఇది పూర్తిగా ఏసీబీ పరిధిలోకి వచ్చే విషయం కాబట్టి, ఏసీబీ స్టాండింగ్ కౌన్సిల్ స్పందించాలని పిటిషనర్ తరఫు న్యాయవాది కోర్టుకు స్పష్టం చేశారు. మంత్రి పదవిలో ఉన్న వ్యక్తి సినిమాల్లో నటించడం వల్ల ప్రజాస్వామ్య నిబంధనలు, రాజ్యాంగ విలువలు దెబ్బతింటాయని వాదించారు.ఈ కేసులో హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. హోమ్ డిపార్ట్‌మెంట్, జనరల్ అడ్మినిస్ట్రేషన్,డిపార్ట్‌మెంట్(జిఏడి),ఏసీబీకినోటీసులు జారీ చేసింది.అలాగే, సీబీఐ పేరును కూడా రికార్డులో పొందుపరచాలని రిజిస్ట్రీని ఆదేశించింది. కేసును వారం రోజులకు లేదా వచ్చే వారం లిస్టింగ్‌లో మరోసారి విచారణకు తీసుకురానున్నట్లు హైకోర్టు వెల్లడించింది.
Authored by: Vaddadi udayakumar