అమరావతి,ఐఏషియ న్యూస్: ప్రధాని మోదీ 16న ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వస్తున్నారు.కర్నూలులో భారీ బహిరంగ సభలో పాల్గొని, శ్రీశైలం మల్లికార్జున స్వామిని దర్శించుకుంటారు. రాగమయూరి గ్రీన్ హిల్స్ వెంచర్‌కు శంకుస్థాపన చేయనున్నారు. ఈ సభ విజయవంతం కోసం మంత్రి లోకేశ్ అధికారులకు సూచనలు చేశారు. జీఎస్టీ 2.0 ప్రయోజనాలపై అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. ఈ మేరకు ప్రధాని మోదీ పర్యటనకు శ్రీశైలం, కర్నూలులో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.
ఈ నెల 16న ఉదయం 7.50 కు ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో ప్రధాని బయల్దేరతారు. ఉదయం 10.20 కు కర్నూలు ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి సున్నిపెంట వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌కు మోదీ చేరుకుంటారు. ఉదయం 11.10 కి రోడ్డుమార్గంలో శ్రీశైలం భ్రమరాంబ గెస్ట్ హౌస్‌కు చేరుకుంటారు. ఉదయం 11.45 కి భ్రమరాంబ మల్లికార్జున స్వామిని దర్శించుకుంటారు. మధ్యాహ్నం 1.40కి సున్నిపెంట హెలిప్యాడ్ నుంచి నన్నూరు హెలిప్యాడ్‌కు ప్రధాని మోదీ బయల్దేరి వెళతారు. మధ్యాహ్నం 2.30 కు రాగమయూరి గ్రీన్ హిల్స్ వెంచర్‌కు ప్రధాని మోదీ శంకుస్థాపన చేస్తారు. అనంతరం సాయంత్రం 4 గంటల వరకు బహిరంగ సభలో ప్రధాని మోదీ పాల్గొంటారు. సాయంత్రం 4.15 కు రోడ్డుమార్గంలో నన్నూరు హెలిప్యాడ్‌కు చేరుకొని సాయంత్రం 4.40కు కర్నూలు ఎయిర్‌పోర్ట్‌కు చేరుకొని ఢిల్లీకి వెళతారు. సూపర్ జీఎస్టీ సూపర్ హిట్ సభలో ప్రధాని మోదీతో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి లోకేశ్ ప్రసంగిస్తారు.
ఈ సభ కోసం 40 ఎకరాల విస్తీర్ణంలో ప్రధాన వేదికను, ప్రజలు సౌకర్యంగా కూర్చోవడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు తరలిరావడానికి పదివేల బస్సులు, ఇతర వాహనాలు వస్తాయి. వాటిని నిలిపేందుకు 347 ఎకరాల్లో విశాలమైన ప్రాంగణాలను సిద్ధం చేస్తున్నారు. మంత్రి టీజీ భరత్, ప్రధాని కార్యక్రమ ప్రత్యేక అధికారి వీర పాండియన్, జిల్లా కలెక్టర్ సిరి, జిల్లా ఎస్పీ విక్రాంత్‌పాటిల్, ఎమ్మెల్సీ బీటీ నాయుడు, ఎమ్మెల్యేలు కేఈ శ్యాంబాబు, దస్తగిరి, కుడా ఛైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు, సీఎం కార్యక్రమ సమన్వయకర్త సత్యనారాయణరాజు తదితరులు ఈ ఏర్పాట్లను పరిశీలించారు.
Authored by: Vaddadi udayakumar