
మొత్తం 452 మంది లోక్ సభ, రాజ్యసభ సభ్యులు ఆయనకు ఓటు వేశారు. ఈ నెల 12వ తేదీన అంటే శుక్రవారం నాడు రాధాకృష్ణన్ ఉపరాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. ఈ ఎన్నికల్లో మొత్తం 767 మంది ఎంపీలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వాటిలో 15 ఓట్లు చెల్లుబాటు కాలేదు. రాధాకృష్ణన్‌కు 452 ఓట్లు రాగా, సుదర్శన్ రెడ్డికి 300 ఓట్లు పోల్ అయ్యాయి.
బిజూ జనతాదళ్, భారత్ రాష్ట్ర సమితి, శిరోమణి అకాలీదళ్ ఈ ఎన్నికలను బహిష్కరించిన విషయం తెలిసిందే. ఆయా పార్టీలకు చెందిన సభ్యులెవరూ కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోలేదు. వీరితో పాటు స్వతంత్రులు కూడా ఓటు వేయలేదు. మొత్తం 13 మంది ఎంపీలు ఎన్నికలకు దూరంగా ఉన్నారు.సీపీ రాధాకృష్ణన్ స్వరాష్ట్రం తమిళనాడు. ప్రస్తుతం మహారాష్ట్ర గవర్నర్‌గా ఉన్నారు. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్, జనసంఘ్‌తో ఆయనకున్న సుదీర్ఘ అనుబంధం ఉంది. ఈ రెండింటితోనే ఆయన రాజకీయ ప్రస్థానం ప్రారంభమైంది.

67 ఏళ్ల రాధాకృష్ణన్ అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో కోయంబత్తూరు నుండి రెండుసార్లు లోక్‌సభ సభ్యుడిగా పనిచేశారు. ఆ తర్వాత తమిళనాడులో బీజేపీకి నాయకత్వం వహించారు.1957లో తిరుప్పూర్‌లో జన్మించారాయన. కేరళకు పార్టీ ఇన్‌చార్జ్ వ్యవహరించారు. 2023లో తొలిసారిగా రాజ్ భవన్ లో అడుగు పెట్టారు. తొలుత జార్ఖండ్, తరువాత మహారాష్ట్ర గవర్నర్‌గా పనిచేశారు. కొంగు వెల్లలార్ గౌండర్ సామాజిక వర్గానికి చెందిన నాయకుడు సీపీఆర్. కొంగు బెల్ట్ సాంప్రదాయకంగా ఏఐఏడీఎంకే వైపు మొగ్గు చూపే ఓటు బ్యాంక్. ఈ ఎన్నికల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎన్డీఏ తరపున మొదట ఆయనే ఓటు వేశారు. ఉదయం సరిగ్గా 10 గంటలకు పార్లమెంట్ హౌస్ కు చేరుకున్నారు. పలువురు కేంద్రమంత్రులు, లోక్ సభ, రాజ్యసభ సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటోన్నారు. లోక్ సభ, రాజ్యసభలో ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే, కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చీఫ్ సోనియా గాంధీ ఓటు వేశారు.
నిజానికి- ఎన్డీఏ కూటమికి ఉన్న బలం కంటే అధికంగా ఓట్లు పోల్ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇండియా బ్లాక్ కు చెందిన కొంతమంది ఎంపీలు క్రాస్ ఓటింగ్ కు పాల్పడి ఉండొచ్చనే అంచనాలు వ్యక్తమౌతోన్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యురాలు స్వాతి మలివాల్. పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా సీపీ రాధాకృష్ణన్ ఓటు వేయడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ ఎన్ డి ఏ బలపరిచిన రాధాకృష్ణన్ భారతదేశ 15వ ఉపరాష్ట్రపతిగా ఎన్నికయ్యారు.ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన రాధాకృష్ణను ప్రధాని మోదీ నరేంద్ర మోడీతో సహా కేంద్రమంత్రులు,ఎంపీలు అభినందనలు శుభాకాంక్షలు తెలియజేశారు.
Authored by: Vaddadi udayakumar