విజయనగరం,ఐఏషియ న్యూస్: విజయనగర సాహితీ వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న ఈతరం రచయిత్రి రాధిక మంగిపూడి, సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం కీర్తి పురస్కారానికి ఎంపిక అయ్యారు. 2023 సంవత్సరానికిగాను వివిధ రంగాలలో ప్రసిద్ధిగాంచిన 48 మందిని ఎంపిక చేసినట్లుగా, వారిలో హాస్య రచనల విభాగంలో రాధిక ఎంపికయ్యారని తెలుగు విశ్వవిద్యాలయం వారు గురువారం పత్రికా ప్రకటనలో తెలిపారు. రాధిక మంగిపూడి 2016లో సింగపూర్ లో తన సాహితీ ప్రస్థానం ప్రారంభించి ఇప్పటివరకు 3 కథా సంపుటలు,2 కవితా సంపుటలు,2 పద్య శతకాలు, ఒక వ్యాస సంపుటి రచించారు.ఈనెల 16వ తేదీ అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో హ్యూస్టన్ మహానగరంలో జరిగిన “14వ అమెరికా తెలుగు సాహితీ సదస్సు”కు ప్రధాన అతిథులలో ఒకరిగా రాధిక హాజరయ్యారు. “తొలిసారి అమెరికా పర్యటనతో పాటు అంతటి ప్రతిష్టాత్మక వేదికపై తాను ప్రసంగించడం,తన 8వ పుస్తకం “కథ కంచికి” అనే నూతన కథా సంపుటి ప్రముఖ సినీ రచయిత బుర్రా సాయిమాధవ్, డా.వంగూరి చిట్టిన్ రాజు తదితరుల చేతులమీదుగా ఆవిష్కరించబడడం చాలా సంతోషంగా ఉందని,ఆ వెనువెంటనే తెలుగు విశ్వవిద్యాలయం వారి కీర్తి పురస్కారానికి ఎంపిక అవ్వడం ఇంకా ఆనందంగా ఉందని రాధిక తెలిపారు.రాధిక ఈ పురస్కారం అందుకోవడం పట్ల పలువురు విజయనగర ప్రముఖులు, గోల్డెన్ హెరిటేజ్ ఆఫ్ విజయనగరం సంస్థ సభ్యులు అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేశారు.
Authored by: Vaddadi udayakumar